ములకలపల్లి: పురుగులమందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన గజ్జల మహేశ్వరి (34)కి పదహారేళ్ల కిందట వివాహమైంది. గర్భవతిగా ఉన్న సమయంలోనే భర్త రాంబాబు చనిపోయాడు. మహేశ్వరి కూలీ పని చేసుకుంటూ కూతురును చదివిస్తోంది. ఒంటరితనంతో బాధపడుతున్న మహేశ్వరి.. సోమవారం ఇంటివద్ద పురుగులమందు తాగగా.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు బండ వెంకటరామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ పుల్లారావు తెలిపారు.
ఆగి ఉన్నలారీని
ఢీకొట్టిన మరో లారీ
దమ్మపేట: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటన మండలంలోని మందలపల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మందలపల్లి రహదారిపై ఆగిఉన్న లారీని సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఆగి ఉన్న లారీ పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాల మెకానిక్ గ్యారేజ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్యారేజ్ రేకుల షెడ్డు, ఒక ద్విచక్రవాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి.
లారీని ఢీకొట్టిన బైక్
కొత్తగూడెంఅర్బన్: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ద్విచక్రవాహనదారుడు మంగళవారం మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. లాలుతండాకు చెందిన భూక్య సురేశ్ (36) రేగళ్ల నుంచి ద్విచక్రవాహనంపై కొత్తగూడెం వైపు వస్తుండగా మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి తీవ్ర గాయాలపాలయ్యాడు. సురేశ్‌ను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
జూలూరుపాడు: మండలంలోని పడమటనర్సాపురం డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయం సమీపంలో తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఖమ్మం వైపు నుంచి వెళ్తున్న కారు.. ముందున్న కారును ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వెంగన్నపాలెంనకు చెందిన వల్లోజి నీరజ్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన ఆదిత్య తీవ్రంగా గాయపడ్డారు. యువకులు ఇద్దరికి కాళ్లు విరిగాయి. కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లగా, బైక్ నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment