ఇసుక నిల్వలు స్వాధీనం
ములకలపల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక రాశులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని ఆనందపురం శివారులోని రిసార్ట్స్ వెనుక ప్రదేశంలో భారీగా ఇసుక నిల్వ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తహసీల్దార్ గుడ్ల పుల్లారావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది దాడి చేసి సుమారు రెండు లారీల ఇసుకను సీజ్ చేశారు. కాగా, ఇదే ప్రదేశంలో పది రోజుల కిందట రెండు లారీల ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన విషయం విదితమే. డీటీ భాగ్యలక్ష్మి, భద్రు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
దమ్మపేట: విద్యార్థిని ఆకారణంగా ఉపాధ్యాయుడు కొట్టాడనే నెపంతో, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం అదే పాఠశాలలో ఆందోళన నిర్వహించారు. మండలంలోని గండుగులపల్లి గ్రామానికి చెందిన యదిరాజ రోహిత్ అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 21న రోహిత్‌ను గణిత ఉపాధ్యాయుడు మారయ్య కొట్లాడని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు సోమవారం ఆందోళన నిర్వహించారు. హెచ్‌ఎం మస్తాన్ వలీ సర్దిజెప్పి ఆందోళనను విరమింపజేయాలని కోరారు. సమస్యను ఎంఈఓ, డీఈఓల దృష్టికి తీసుకెళ్తానని హెచ్‌ఎం హామీ ఇచ్చారు.
చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలు
భద్రాచలంఅర్బన్: చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివనాయక్ సోమవారం తీర్పునిచ్చారు. భద్రాచలం పట్టణానికి చెందిన కల్లెం వీరాంజనేయులు వద్ద బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామానికి చెందిన రాంశెట్టి శ్రీనివాస్ 2016లో రూ.5 లక్షల చెక్కు హామీగా పెట్టి రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తన బాకీ చెల్లించాలని వీరాంజనేయులు అనేక సార్లు కోరినా అతను చెల్లించలేదు. చివరకు 2019లో సదరు చెక్కును బ్యాంక్‌లో జమ చేయగా రాంశెట్టి శ్రీనివాస్ ఖాతాలో సరిపడా నగదు లేక బౌన్స్ అయింది. దీంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. సాక్షులను విచారించిన అనంతరం నేరం నిరూపణ కావడంతో రాంశెట్టి శ్రీనివాస్‌కు 6 నెలల సాధారణ జైలు శిక్ష, పరిహారం కింద ఫిర్యాదుదారుడికి రూ.5 లక్షలను ఒక నెలలో చెల్లించాలని తీర్పు చెప్పారు. నిర్ణీత గడువులో డబ్బులు చెల్లించకపోతే మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తెలిపారు.
పోక్సో కేసు నమోదు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం పట్టణ పరిధి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. వన్ టౌన్ సీఐ కరుణాకర్ కథనం ప్రకారం.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న హోటళ్లలో పనిచేసే ఓ వ్యక్తి తన 12 ఏళ్ల కూతురుపై 11 నెలల కిందట లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ బాలిక తల్లిదండ్రుల మధ్య గొడవ కావడంతో తల్లి కుతూరిని తీసుకొని మణుగూరుకు బంధువుల ఇంటికి వెళ్లింది. బాలిక విషయం చెప్పడంతో తల్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పినపాకలో..
పినపాక: బాలికపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిపై ఈ–బయ్యారం పోలీస్ స్టేషన్లో సోమవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పోతురాజుల సాంబశివరావు అదే గ్రామానికి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక అతని నుంచి తప్పించుకొని గట్టిగా అరవడంతో పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సాంబశివరావుపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపారు.
ఉరి వేసుకుని ఆత్మహత్య
పినపాక: మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఈ–బయ్యారంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బయ్యారం పంచాయతీలోని గార్ల బయ్యారం గ్రామానికి చెందిన యాదగిరిసాగర్ (38) మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల కిందట భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య మంగతాయారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment