అర్హులందరికీ సంక్షేమ పథకాలు
● జాబితాలో పేరు లేదని ఆందోళన చెందొద్దు ● పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక.. ఇది నిరంతర ప్రక్రియ ● కలెక్టర్ జితేష్ వి పాటిల్
చండ్రుగొండ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలు అర్హులందరికీ వస్తాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని మద్దుకూరులో మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత జాబితాలో పేరు లేనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు. జాబితాలో పేరు లేనివారు తిరిగి పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సంక్షేమ పథకాల కోసం పైరవీకారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతుభరోసా పథకానికి ఆమోదయోగ్యం కాని భూములను ఇప్పటికే గుర్తించామని, వాటికి ఆర్థిక సాయం అందకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వలస గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోడు భూములకు ఇప్పటికే పట్టాలు ఇచ్చినందున మళ్లీ కొత్తగా పోడు నరకవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫిర్యాదులపై విచారణ..
మండలంలోని రెండు గ్రామాల వారు తమకు జరిగిన అన్యాయంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి ఇటీవల చేసుకున్న ఫిర్యాదులపై కలెక్టర్ విచారణ జరిపారు. బాల్యాతండాలో బోరుబావి విషయమై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదంపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. బెండాలపాడులో నాలుగేళ్ల క్రితం మిర్చి కొనుగోలు చేసిన వ్యాపారి నేటికీ డబ్బులు ఇవ్వలేదన్న ఫిర్యాదుపై తహసీల్దార్ కార్యాలయంలో బాధితులతో, వ్యాపారితో నేరుగా మాట్లాడి విచారణ జరిపారు. కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ విద్యాచందన, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రిపబ్లిక్ వేడుకల విజయవంతానికి కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వేదికతో పాటు విద్యాశాఖ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యుత్, తాగునీరు, సౌండ్‌ప్రూఫ్ జనరేటర్ అందుబాటులో ఉంచాలని, బారికేడ్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment