రామయ్యకు వైభవంగా విలాసోత్సవం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం రాత్రి విలాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోని స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో తీసుకొచ్చి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు.
నేత్రపర్వంగా నిత్యకల్యాణం..
శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
పామాయిల్ ఫ్యాక్టరీకి నేటి నుంచి సెలవులు
దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో బుధవారం నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్టు ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పామాయిల్ గెలల దిగుబడి తక్కువగా వస్తున్నందున ఈ సమయంలోనే మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. టన్ను బరువు కంటే తక్కువ ఉండే గెలలను అప్పారావుపేట ఫ్యాక్టరీకి, టన్ను కంటే అధిక బరువు గల గెలలను అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తరలించాలని రైతులను కోరారు.
మార్కెటింగ్ మోసాల బారిన పడొద్దు
ఎస్పీ రోహిత్‌రాజ్
కొత్తగూడెంటౌన్: ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో కొందరు పలు రకాల ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్ కేర్, ఇతర గృహోపకరణాల మార్కెటింగ్ పేరుతో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని, చైన్ సిస్టమ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని తెలిపారు. విలాసవంతమైన వస్తువులు, విల్లాలు, ఫ్లాట్‌లు ఇస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని రకరకాల ఆఫర్లతో వస్తుంటారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ‘మనకు ఎలాంటి సంబంధం లేనివారు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చరు’ అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గ్రహించాలని కోరారు. సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్, యూట్యూబ్, ఈ–మెయిల్ వంటి వాటి ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేస్తారని, అలాంటి ప్రకటనలను నమ్మొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా మోసపోతే తక్షణమే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, లేదంటే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment