ఇకపై మార్కెట్‌ మోసాలకు బ్రోకర్ల చెక్‌ | Check brokers for market manipulation | Sakshi
Sakshi News home page

ఇకపై మార్కెట్‌ మోసాలకు బ్రోకర్ల చెక్‌

Published Thu, Jul 4 2024 9:05 AM | Last Updated on Thu, Jul 4 2024 10:02 AM

Check brokers for market manipulation

    స్టాక్‌ బ్రోకర్లకు మార్గదర్శకాలు 

    వ్యవస్థలను సన్నద్ధం చేయాలి 

    సెబీ తాజా నోటిఫికేషన్‌ జారీ 

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ మోసాలకు ఇకపై బ్రోకర్లు సైతం చెక్‌ పెట్టేందుకు వీలు చిక్కనుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇన్‌స్టిట్యూషనల్‌ మెకనిజంపై తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.  స్టాక్‌ బ్రోకర్లు మార్కెట్‌ మోసాలను పసిగట్టడం, అరికట్టడం వంటి చర్యలకు వీలుగా వ్యవస్థలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది. 

వాస్తవానికి ఇప్పటిదాకా మార్కెట్‌ మోసాలకు బ్రోకర్లను బాధ్యులు చేసే ఎలాంటి ప్రత్యేకించిన నియంత్రణ నిబంధనలు లేకపోవడం గమనార్హం! తాజా మార్గదర్శకాల ప్రకారం మార్కెట్‌ మోసాలను గుర్తించడం, నివారించడం తదితరాలకు బ్రోకింగ్‌ సంస్థలతోపాటు.. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇకపై బ్రోకింగ్‌ సంస్థలు కూడా ఇందుకు తగిన పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. సెబీ సైతం బ్రోకర్ల వ్యవస్థల ద్వారా మార్కెట్‌ మోసాలకు వీలున్న అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. తప్పుదారి పట్టించే ట్రేడింగ్, షేర్ల ధరల కృత్రిమ కదలికలు(పెంపు లేదా పతనం), ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, అక్రమ ఖాతాల ద్వారా అనధికార లావాదేవీలకు అవకాశాలుండటం తదితర మోసాలను సెబీ ప్రస్తావించింది. 

జూన్‌ 27వ తేదీన విడుదలైన  నోటిఫికేషన్‌ ప్రకారం స్టాక్‌ బ్రోకర్‌ ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలను గుర్తించినా 48 గంటల్లోగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేయవలసి ఉంటుంది. అంతేకాకుండా అక్రమాలను గుర్తిస్తే వాటిపై తీసుకున్న చర్యలను వెల్లడించాల్సి ఉంటుంది. లేదా ఎలాంటి అవకతవకలనూ గుర్తించలేదంటూ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నివేదికను దాఖలు చేయవలసి ఉంటుంది. తాజా నోటిఫికేషన్‌ ద్వారా స్టాక్‌ బ్రోకర్లు సహా.. అవకతవకలు, చట్టవిరుద్ధ లావాదేవీల నిరోధక చట్ట (పీఎఫ్‌యూటీపీ) నిబంధనలను సెబీ సవరించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement