Elon Musk's Twitter Threatens To Sue Meta Over Threads App - Sakshi
Sakshi News home page

చట్టపరమైన చిక్కుల్లో థ్రెడ్స్‌.. మార్క్‌ జుకర్‌ బర్గ్‌కు నోటీసులు!

Published Fri, Jul 7 2023 9:51 AM | Last Updated on Fri, Jul 7 2023 12:11 PM

Elon Musk Threatening To Sue Meta Over Threads - Sakshi

ఎలాన్‌ మస్క్‌కు చెందిన ట్విటర్‌కు పోటీగా మెటా (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ మాతృసంస్థ) అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌  ‘థ్రెడ్స్‌’ను విడుదల చేశారు. ఈ యాప్‌ సంచలనాలకు కేంద్రం బిందువుగా మారింది. లాంఛ్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 30 మిలియన్‌ యూజర్లను సొంతం చేసుకుంది. అదే సమయంలో చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. తమ మేధో సంపత్తిని (intellectual property rights)ను కాపీ కొట్టారంటూ ఎలాన్‌ మస్క్‌ తన లాయర్‌ అలెక్స్ స్పిరో ద్వారా జుకర్‌ బర్గ్‌కు నోటీసులు పంపించారు.      

ట్విటర్‌ వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నోటీసుల్లో అలెక్స్‌ స్పిరో పేర్కొన్నారు. వీటితో పాటు ట్విటర్‌ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలున్న డజన్ల కొద్దీ మాజీ ట్విటర్‌ ఉద్యోగులను మెటా నియమించుకుందని లేఖలో ఆరోపించింది.

తమ సంస్థ వ్యాపార రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఉపయోగించడం మెటా మానుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే మెటాకు ట్విటర్‌ నోటీసులంటూ వచ్చిన వార్తలను ఉటంకిస్తూ చేసిన ట్వీట్‌కు మస్క్ స్పందించారు. ‘పోటీ మంచిదే.. కానీ మోసం చేయకూడదు’ అని అన్నారు. ఇక, థ్రెడ్స్‌లో ట్విటర్‌ మాజీ ఉద్యోగులున్నారంటూ ట్విటర్‌ పంపిన నోటీసుల్ని మెటా ఖండించింది. థ్రెడ్స్‌ ఐటీ విభాగంలో మాజీ ట్విటర్ ఉద్యోగులు ఎవరూ లేరని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ థ్రెడ్స్ పోస్ట్‌లో తెలిపారు.

మేధో సంపత్తి అంటే?
మేధో సంపత్తి అనేది కంటికి కనిపించని ఆస్తుల్లోని ఓ భాగం. మనుషులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణ, సాహిత్య, కళాత్మక పని, డిజైన్లు, చిహ్నాలు (సింబల్స్), పేర్లు, చిత్రాలు (ఇమేజెస్) వంటివి ఈ జాబితాలో ఉంటాయి. వీటికి వ్యక్తుల మనసు, తెలివితేటలు ప్రాణం పోస్తాయి. వీటి సృష్టికి సంబంధించిన ఐడియాలు కంటికి కనిపించవు. ఈ ఐడియాలనే మేధో సంపత్తి అంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement