ముంబై : చుక్కలు తాకిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గత రెండ్రోజులుగా తగ్గిన బంగారం ధరలు గురువారం వరుసగా మూడో రోజూ దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి 547 రూపాయలు తగ్గి 52,075కు దిగివచ్చింది. ఇక కిలో వెండి 804 రూపాయలు పతనమై 67,519 రూపాయలకు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన చర్యలను కొనసాగిస్తామని ప్రకటించడంతో పసిడికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ తగ్గుముఖం పట్టిందని బులియన్ నిపుణులు అంచనా వేశారు.
వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగుతుందని ఫెడ్ ప్రకటించడంతో మార్కెట్‌లో ద్రవ్య లభ్యత పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే సంకేతాలు వెల్లడయ్యాయి. ఇక గత రెండు రోజులగా పదిగ్రాముల బంగారం 1600 రూపాయలు తగ్గగా వెండి ధరలు ఏకంగా 2000 రూపాయలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఏడాది ఇప్పటికే 27 శాతం పెరిగిన పసిడి పరుగుపై విశ్లేషకులు ఇంకా సానుకూలంగానే స్పందిస్తున్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ట్రేడ్ వార్ పరిణామాలతో దీర్ఘకాలంలో బంగారం లాభపడుతుందని వారు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment