న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం నవంబర్‌లో 14.23 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 నవంబర్ ధరలతో పోల్చితే, టోకు ధరల బాస్కెట్ ధర తాజా సమీక్షా నెల్లో 14.23 శాతం పెరిగిందన్నమాట. గడచిన దశాబ్ద కాలంలో ఈ స్థాయి ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సహజవాయువు, క్రూడ్ పెట్రోలియం, మెటల్స్, మినరల్ ఆయిల్స్, రసాయనాలు, ఫుడ్ ప్రాడెక్ట్స్ ధరల్లో భారీ పెరుగుదల దీనికి ప్రధాన కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
గత ఏడాది నవంబర్‌లో ఉన్న లో బేస్ ఎఫెక్ట్ కూడా దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకూ గడచిన ఎనిమిది నెలల్లోనూ ద్రవ్యోల్బణం రెండంకెల పైనే కొనసాగుతోంది. దీనికి 2021 ఇదే నెలల్లో లో బేస్ ప్రధాన కారణంగా కనబడుతోంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 నవంబర్‌ను తీసుకుంటే టోకు ద్రవ్యోల్బణం 2.29 శాతం మాత్రమే.
కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► మొత్తం సూచీలో దాదాపు 22 శాతం వాటా ఉన్న ఇంధనం, విద్యుత్ రంగాల్లో ద్రవ్యోల్బణం 39.81 శాతంగా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఈ రేటు 37.18 శాతం. ఒక్క క్రూడ్ పెట్రోలియం ద్రవ్యోల్బణం పరిశీలిస్తే, ఈ రేటు అక్టోబర్‌లో 80.57 శాతం ఉంటే, నవంబర్‌లో 91.74 శాతానికి పెరిగింది.
► సూచీలో దాదాపు 24 శాతం వెయిటేజ్ ఉన్న ఫుడ్ ఇండెక్స్ అక్టోబర్‌లో 3.06 శాతం పెరిగితే, నవంబర్‌లో 6.70 శాతం ఎగసింది.
► డబ్ల్యూపీఐలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 11.92 శాతం. అక్టోబర్‌లో ఈ రేటు 12.04 శాతం.
► భారత్‌లోనే కాకుండా, అమెరికా, ఇటలీ, జర్మనీ, సింగపూర్ వంటి దేశాల్లో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 20 శాతంగా కొనసాగడం గమనార్హం.
► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 4.48 శాతం ఉంటే, నవంబర్‌లో 4.91 శాతానికి ఎగసింది. రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా ఆర్‌బీఐ వరుసగా తొమ్మిది ద్వైమాసిక సమావేశంలోనూ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4%) యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా కొనసాగుతుందని, మూడు, నాలుగు త్రైమాసికాల్లో 5.1%, 5.7%గా ఉంటుందని అంచనావేసింది. 2022–23 క్యూ1, క్యూ2లలో 5%గా ఉంటుందని ఆర్‌బీఐ విశ్లేషిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment