దడ పుట్టిస్తున్న డిజిటల్‌ అరెస్ట్‌లు | - | Sakshi
Sakshi News home page

దడ పుట్టిస్తున్న డిజిటల్‌ అరెస్ట్‌లు

Published Thu, Nov 21 2024 1:38 AM | Last Updated on Thu, Nov 21 2024 1:38 AM

దడ పు

దడ పుట్టిస్తున్న డిజిటల్‌ అరెస్ట్‌లు

● పెచ్చుమీరిన సైబర్‌ నేరగాళ్ల నయా మోసాలు ● పలుకుబడి ఉన్నవారే వారి టార్గెట్‌ ● మీ అబ్బాయి/అమ్మాయి వద్ద డ్రగ్స్‌ దొరికాయంటూ భయపెడతారు ● ఆపై అరెస్ట్‌ అంటూ తల్లిదండ్రులకు ఫోన్‌ కాల్స్‌ ● సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని వీడియో కాల్స్‌ ● కేసు నుంచి తప్పించాలంటే అమౌంట్‌ పంపాలంటూ బెదిరింపులు ● ఫిర్యాదు చేయడానికి జంకుతున్న బాధితులు ● జాగ్రత్తగా ఉండాలంటున్న సైబర్‌ క్రైం పోలీసులు

పలమనేరు: నిన్న మొన్నటి వరకు ఒక పంథాలో జరిగిన సైబర్‌ మోసాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వ్యవస్థలో సాధారణ నేరాల కంటే డిజిటల్‌ మోసాలే ఎక్కువయ్యాయి. సైబర్‌ నేరగాళ్లు సైతం సరికొత్తా పంథాను ఎంచుకున్నారు. అదే డిజిటల్‌ అరెస్టులు. వారు సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్లనే టార్గెట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బయటి ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని వారి మొబైల్‌ నంబర్‌లను సేకరించి హ్యాకర్లు బ్లాక్‌మెయిల్‌ చేసి అరెస్ట్‌ చేశామంటూ బెదిరిస్తున్నారు. కనీసం తాము మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదు. డిజిటల్‌ అరెస్ట్‌లకు అంతేలేకుండా పోతోంది. కేవలం ఫోన్‌ కాల్‌తోనే మాటల్లో అరెస్ట్‌ చేసినట్టు భయాన్ని పుట్టిస్తూ దొరికినంత దోచేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఫేక్‌ కాల్స్‌తో ఇప్పటికే కొందరు లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.

మీ అమ్మాయి బ్యాగులో డ్రగ్స్‌ అంటూ..

ఇటీవల పలమనేరుకు చెందిన భాస్కర్‌ కుమార్తె బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ అక్కడ పీజీలో ఉంటోంది. వీరి తండ్రికి ఓ గుర్తు తెలియని నంబరు నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. మీ అమ్మాయి ఓ పబ్‌లో స్నేహితులతో కలసి ఉండగా ఆమె బ్యాగులో డ్రగ్స్‌ ఉండగా పట్టుకున్నామని వెంటనే లక్ష పంపాలని కాల్‌ వచ్చింది. దీంతో భాస్కర్‌ తన భార్య మొబైల్‌ నుంచి కుమార్తెకు ఫోన్‌ చేయగా తాను ఆఫీసులో ఉన్నానంటూ సమాధానం వచ్చింది. అయితే ఆయనకు మళ్లీ అదే నంబరు నుంచి ఫోన్‌ రావడంతో తాము పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారమని ఇంగ్లిషులో గట్టిగా మాట్లాడడంతో ఫోన్‌ కట్‌ అయింది. ఆపై ఆ సెల్‌ నంబర్‌ స్విచ్‌ఆఫ్‌ అయింది. ఇలాంటి బెదిరింపు కాల్స్‌ ఈ మధ్యలో ఎక్కువగా వస్తున్నాయి. కొందరు భయపడి డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేసి ఆపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా మౌనం వహిస్తున్న వారు ఉన్నారు. ఇలాంటి నకిలీ ఫోన్‌ కాల్స్‌కు భయపడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

కొంపముంచుతున్న కేవైసీ..

ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఖాతా నంబరు, సెల్‌ఫోన్‌ నంబర్లతో కేవైసీ చేస్తుంటాం. అయితే ఈ వివరాలు ఆదాయపు పన్నుశాఖకు వెళ్తుంటాయి. ఈ మొత్తం సమాచారం ఇన్‌సెట్‌ అయి ఉండడంతో హ్యాకర్లకు డేటాను దొంగిలించేందుకు మంచిమార్గం దొరికినట్టుగా అనుమానం ఉంది. ఇందుకు ప్రైవేట్‌ సెల్‌ నెట్‌వర్క్‌ నుంచి సైతం లీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాల ఆధారంగా మోసగాళ్లు మన స్మార్ట్‌ఫోన్‌ లొకేషన్‌ను ట్రేస్‌ చేసి ఎవరు ఎక్కడున్నారనే విషయాన్ని సైతం చెప్పగలరు. ఆపై పలు రకాలుగా మోసాలు చేస్తూ మననోటి ద్వారానే ఓటీపీలు చెప్పించి మనల్ని బురిడీ కొట్టిస్తున్నారు.

వీరి

మోసాలు ఎలా

ఉంటాయంటే..?

పలమనేరు సమీపంలోని కర్ణాటక సరిహద్దు గ్రామానికి చెందిన ఓ కోటీశ్వరురాలి కుమార్తె బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తోంది. ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. ఆమెకు ముంబై సీబీఐ పోలీసులంటూ వీడియో కాల్‌ వచ్చింది. ఆ కాల్‌లో యూనిఫాంలో ఉన్న పోలీస్‌, వెనుక పోలీస్‌ సింహాలు అన్నీ కనిపించడంతో నిజమైన పోలీసులే అనుకుంది. వారు కాల్‌ చేసి బెంగళూరులోని ఐటీ వద్ద ఉన్న మీ అపార్ట్‌మెంట్‌ రూమ్‌నెం.304కు ఓ పార్శిల్‌ వచ్చిందని అందులో బ్రౌన్‌ షుగర్‌ ఉందని..అందుకే మిమ్మల్లి డిజిటల్‌ అరెస్ట్‌ చేశామంటూ చెప్పారు. మీరు అరెస్ట్‌ కాకుండా తప్పించుకోవాలంటే వెంటనే రూ.10 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని బెదిరించారు. అయితే ఆమె తనవద్ద డబ్బులేదని చెప్పింది. ఫలానా బ్యాంకు ఖాతాలో మీ ఎఫ్‌డీలో రూ.2 కోట్లు ఉన్నాయని చెప్పడంతో ఖంగు తిన్న ఆమె వెంటనే రూ.6లక్షలను వారు చెప్పిన నంబర్లుకు గూగూల్‌పే, ఫోన్‌పే, ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేసింది. తాను మోసపోయానని రెండురోజుల తర్వాత తెలుసుకున్న బాధితురాలు బెంగళూరు సైబర్‌క్రైమ్‌కు పిర్యాదు చేసింది.

అసలు నంబర్లు ఎలా తీసుకుంటున్నారో..!

సైబర్‌ నేరగాళ్లకు మన ఫోన్‌నంబర్లు, వ్యక్తిగత సమాచారం ఎలా చేరుతుందనే విషయం పోలీసులకు సైతం అర్థం కావడం లేదు. నేరస్తులు ఫోన్‌ చేసి తాము సీబీఐ, నార్కోటిక్స్‌, ఎకై ్సజ్‌, ఇంటెలిజెన్స్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌లాంటి శాఖలను వాడుకుంటూ వారి ఫేసుబుక్‌ ఖాతాల్లో పోలీసుల ఫేక్‌ ఫొటోలను పెట్టి పిల్లల పేరు, ఎక్కడ చదువుతున్నారు ? ఏ దేశం, ఏ ప్రాంతం ఇలాంటి వివరాలను ఎలా చెబుతున్నారన్నది అసలు అర్థం కావడం లేదు. హ్యాకర్లు చెప్పే మాటలు నిజాలు కావడంతో పేరెంట్స్‌ సైతం నమ్మాల్సిన పరిస్థితి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
దడ పుట్టిస్తున్న డిజిటల్‌ అరెస్ట్‌లు1
1/1

దడ పుట్టిస్తున్న డిజిటల్‌ అరెస్ట్‌లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement