అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్ల అరెస్టు
● పూతలపట్టులో మహిళ మృతికి కారకులు వీళ్లే..! ● కర్ణాటకకు చెందిన ముఠాకు గుర్తింపు ● వివరాలు వెల్లడించిన చిత్తూరు ఎస్పీ మణికంఠ
చిత్తూరు అర్బన్: వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ మహిళ మృతికి కారణమైన నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన ముల్లహళ్లి శివకుమార్ (35), ఇతని అన్న ముల్లహళ్లి చంద్రశేఖర్ (40), సయ్యద్ రెహాన్ (19), బి.కుమార్ (19) అనే నలుగురి అరెస్టుకు సంబంధించిన వివరాలను బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీఎస్పీ సాయినాథ్‌తో కలిసి ఎస్పీ మణికంఠ మీడియాకు వివరించారు.
ఏం జరిగిందంటే..
గతనెల 26వ తేదీ పూతలపట్టు జాతీయ రహదారిపై మూడు చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. 3 గంటల ప్రాంతంలో కిచ్చన్నగారిపల్లె వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ బైక్‌లో వచ్చి అటుగా వెళ్తున్న మహిళ మెడలోని 64 గ్రాముల బంగారు గొలుసునులాక్కెళ్లారు. 10 నిమిషాల తరువాత పూతలపట్టు–తేనేపల్లె వద్ద బైక్‌పై వెళ్తున్న తల్లీ కూతురిని వెంబడించి వెనుక కూర్చున్న తల్లి మెడలో ఉన్న బంగారు గొలుసును లాగడానికి ప్రయత్నించగా ఆమె కింద పడిపోయింది. చోరీ విఫలమవడంతో నిందితులు పారిపోయారు. మళ్లీ 5 నిమిషాల తరువాత ఐరాల–గుండ్లపల్లె బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న నాగరత్నమ్మ మెడలోని 33 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు. అయితే తీవ్రంగా గాయపడిన ప్రేమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
మూడు రాష్ట్రాల్లో కేసులు..
పోలీసులు మొత్తం ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం జల్లెడ పట్టారు. కర్ణాటకకు చెందిన ప్రధాన నిందితుడు శివకుమార్ బెంగళూరు శివారు ప్రాంతాలకు చెందిన రెహాన్, అబ్బు, కుమార్, చంద్రశేఖర్‌తో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నా డు. వాహనాలను చోరీ చేసి కర్ణాటక, తమిళనాడులో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఇదే ముఠా గత నెల చిత్తూరులో చోరీలకు పాల్పడ్డారు. శివకుమార్ కారులో కూర్చుని చోరీలను పర్యవేక్షిస్తాడు. మొత్తం మూడు రాష్ట్రాల్లో నిందితులపైన 30కి పైగా కేసులున్నాయని ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 53 గ్రాముల బంగారు గొలుసులు, కారు, రెండు బైకులను స్వాధీనం చేసుకు న్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపించిన స్పెషల్‌బ్రాంచ్ సీఐ భాస్కర్, మనోహర్, ఎస్‌ఐ అనిల్, పూతలపట్టు సీఐ కృష్ణకుమార్, సీసీఎస్ సీఐ ఉమామహేశ్వర్, ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment