చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలో పలు కార్మిక సంఘాల నాయకులకు కరపత్రాలను అందజేశారు. ఎన్డీఏలో భాగస్వామిగా రాష్ట్రప్రభుత్వం బీజేపీ వైఖరిని అనుసరిస్తోందన్నారు. కార్మికులు, ఆకలి తీర్చే రైతులకు కాకుండా కార్పొరేట్ వర్గాలకు మోదీ ప్రభుత్వం లాభం చేకూరుస్తోందన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.19.28 లక్షలకోట్లు రుణమాఫీ, పన్నురాయితీ, ప్రోత్సాహాల పేరిట ప్రజల ధనాన్ని దోచిపెట్టిందన్నారు. విశాఖస్టీల్ ప్లాంట్‌తో సహా భారీ పరిశ్రమలు, గనులు, సముద్రతీరాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టేందుకు సిద్ధమైందన్నారు. గత పదేళ్లుగా కనీస వేతనం కోసం కార్మికులు పోరాడుతున్నా అమలుకు నోచుకోలేదని, 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా కేంద్రం మార్చడం అన్యాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment