మీరు మహిళలా?
● సమావేశానికి మహిళలను సమీకరించకపోవడంతో టీడీపీ నాయకులపై నారా భువనేశ్వరి ఆగ్రహం
వి.కోట : పట్టణంలోని మార్కెట్ యార్డులో ఆదివారం ఎన్టీఆర్ సుజల స్రవంతి నీటిశుద్ధి కేంద్రం రెండో సారి ప్రారంభానికి సీఎం సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె అంతా కుప్పం గురించే మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ సమావేశానికి మహిళలను ఎందుకు సమీకరించలేదు.. అందరూ మగవారే వచ్చారు. మహిళలను తీసుకురావడంపై ఇంత అలసత్వమా అని మండి పడ్డారు. టీడీపీ నాయకులను చూసి ‘మీరు మహిళలా..’ అంటూ చురకలంటించారు. అంతేకాక సీఎం చంద్రబాబు కుప్పానికి చేసిన అభివృద్ధి పనులను వల్లె వేస్తూ కుప్పం జపం చేశారు. దీనికి మహిళలు అతి తక్కువ మంది హాజరయ్యారు. కుప్పం మహిళలకు ముఖ్యమంత్రి ఎంతగానో అండగా ఉన్నారంటూ ప్రసంగించారు. పలమనేరు నియోజకవర్గానికి చెందిన వి.కోటను కుప్పంలో భాగమైనట్లు మాట్లాడడంతో ప్రజల్లో అసంతృప్తి కనబడింది. ఆమె సభలో వి.కోటను మర్చిపోవడంపై నాయకులు లోలోన మధనపడడం గమనార్హం. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మహిళలను కార్యక్రమాలకు పిలిస్తే ఎలా వస్తారంటూ నాయకులు గుసగుసలాడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ రామచంద్రనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు రంగనాథ్, నాయకులు ఈశ్వర్, ధీరజ్, శబరీష్, సతీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment