● సంక్రాంతికి రోడ్ల మరమ్మతు పూర్తి చేస్తామని కూటమి హామీ
అడుగుకో గొయ్యి.. గజానికో గుంత.. ఇదీ జిల్లాలోని
రహదారుల దుస్థితి. ఏ దారిలో వెళ్లాలన్నా
ఒడిదుడుకుల ప్రయాణమే..
బండి తోలాల? గుంత చూడాలా అని వాహనచోదకులు బెంగ
చెందుతున్నారు. అధ్వాన రోడ్లలో
ప్రయాణంతో ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ
రాకపోకలు సాగిస్తున్నారు. సంక్రాంతి నాటికి రోడ్లలో గుంతలన్నీ పూడ్చివేస్తాం.. వాహనచోదకులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.. అని కూటమి సర్కారు హామీలు మీద హామీలు గుప్పించింది.
అయితే పెద్ద పండుగ కాస్త దాటిపోతున్నా.. ఏ రహదారి చూసినా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా ఉంది. కూటమి సర్కారు చేసిన బాసలు నగుబాటగా మిగులున్నాయి.
గుంతలమయమైన బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తం రహదారి
చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను మోసం చేసింది. ఇది చాలదన్నట్లు ఐదు నెలల క్రితం గ్రామాల్లో పల్లె పండుగ నిర్వహించి, కపట హామీలు గుప్పించారు. సంక్రాంతి నాటికి పల్లె పండుగలో మంజూరు చేసిన ఎంజీఎన్‌ఆర్‌జీఎస్ రోడ్ల పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ వెళుతున్నా ఆ హామీ మాత్రం నెరవేరలేదు. మంజూరు చేసిన రోడ్ల పనులకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో హామీ బుట్టదాఖలైంది. అరకొర నిధులు మంజూరు చేయడంతో క్షేత్రస్థాయిలో పలు చోట్ల అరకొరగా వేసిన రోడ్లు సైతం నాసిరకంగా ఉన్నాయి. ప్రజల హామీ పక్కన పెడితే ఎలాగైనా నిధులను దోచుకునేందుకు టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు.
1,577 పనులకు 582 మాత్రమే పూర్తి
జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 1,577 పనులకు అనుమతులిచ్చారు. అయితే ఆ పనుల్లో ఇప్పటివరకు 582 పనులు మాత్రం పూర్తి చేశారు. మిగిలిన 995 పనులు ఇంత వరకు ప్రారంభించనేలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని దుస్థితి. 1,577 పనులకుగాను రూ.88.31 కోట్లతో 204 కిలోమీటర్ల మేరకు రోడ్లు వేస్తామని ఐదు నెలల క్రితం హామీ ఇచ్చారు. 204 కిలోమీటర్లకుగాను ఇప్పటివరకు 72.43 కిలోమీటర్ల వరకు మాత్రమే రోడ్లు పూర్తి చేశారు. రూ.88.31 కోట్లకుగాను రూ.22.27 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మిగిలిన రూ.66.04 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేయలేదని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో 10,531.90 మీటర్లు సీసీ రోడ్డు వేయాల్సి ఉండగా 4,615.62 మీటర్ల మాత్రమే వేశారు.
గంగాధరనెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలో 2,275 మీటర్ల సీసీ రోడ్ల పనులకు గాను 549 మీటర్ల మాత్రం పూర్తి చేశారు.
పూతలపట్టు నియోజకవర్గంలో 6,690 మీటర్ల సీసీ రోడ్లకుగాను 2,181.95 మీటర్లు మాత్రం పూర్తి చేశారు.
కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో 11,255 మీటర్ల సీసీ రోడ్లు వేయాల్సి ఉండగా 6,856.70 మీటర్ల మాత్రం పూర్తి చేశారు.
జిల్లాలోని చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పంలో 14,841 మీటర్లు రూ.616.50 లక్షలతో చేపట్టాల్సి ఉంది. అయితే సంక్రాంతి పండుగ నాటికి రూ.98.1 లక్షలను ఖర్చు చేసి 4,471.90 మీటర్ల అప్రోచ్ రోడ్లు మాత్రం వేసి చేతులు దులుపుకున్నారు.
జిల్లాలోని చిత్తూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు నియోజకవర్గాల్లో రూ.686 లక్షలతో 12,443 మీటర్ల మేరకు బీటీ రోడ్లు వేయాల్సి ఉంది. ఇందులో 10 శాతం పనులు కూడా పూర్తి చేయని దుస్థితి.
Comments
Please login to add a commentAdd a comment