ఉర్ధూ పాఠశాలలను బలోపేతం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఉర్ధూ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర ఉర్ధూ టీచర్స్ అసోసియేషన్ (రూటా) రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్‌ఖాన్ కోరారు. మంగళ వారం ఆయన నూతన సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఏపీసీతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఉర్ధూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు చర్యలు చేపట్టాలన్నారు. ఉర్ధూ పాఠశాలలకు ప్రత్యేక ఉర్ధూ స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఏపీసీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉర్ధూ పాఠశాలల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
9 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన తొమ్మిది మందికి రూ.90 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పు ఇచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు గత రెండు రోజులుగా వాహనాలు చేపట్టిన తనిఖీల్లో పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.90 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పుంగనూరు: పట్టణ సమీపంలోని రిలయన్స్ బంక్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. రాజంపేట మండలం పొనేపల్లెకు చెందిన శ్రీనివాసులు(30) తన వాహనంపై బొంతలు తీసుకెళ్లి వ్యాపారం చేసి జీవించేవాడు. ఆయన పుంగనూరు పరిసర ప్రాంతాల్లో వ్యాపారం ముగించుకుని సొంత గ్రామానికి బైక్‌పై వెళుతూ రిలయన్స్ బంక్ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment