ఆశలు..నిరాశే !
● కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు రిక్తహస్తం ● వేతన జీవులకు మొండిచేయి ● బడ్జెట్‌పై పెదవి విరుస్తున్న నిపుణులు ● జిల్లాకు కలిసిరాని నిర్మలమ్మ పద్దు
కేంద్ర మంత్రి నిర్మలమ్మ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. జిల్లాలో పారిశ్రామిక హబ్ ప్రస్తావన కనిపించలేదు.. కొత్త రైల్వే ప్రాజెక్టుల ఊసేలేదు. చిత్తూరులో కనీసం సూపర్ ఫాస్ట్ రైళ్ల స్టాపింగ్‌పై కూడా కనికరం చూపలేదు. జిల్లాలో అధికంగా సాగవుతున్న మామిడి బోర్డు ప్రతిపాదన అటకెక్కించారు. కేంద్రియ విద్యాసంస్థల ఆశలపై నీళ్లు చల్లారు. ఇలా కేంద్ర బడ్జెట్‌లో చిత్తూరు జిల్లాకు అన్ని విధాల మొండిచేయి ఎదురైంది. జిల్లాకు మేలు కలుగుతుందని ఆశించిన ప్రజానికానికి ఈ బడ్జెట్ నిరుత్సాహ పరిచింది. కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు ఒరిగిందేమి లేదని విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చిత్తూరు జిల్లాకు ఒరిగిందేమి లేదని, ప్రధానంగా వేతన జీవులకు ఈ బడ్జెట్ ఎంతో నిరాశను కలిగించిందని జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్‌లో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో జిల్లా వాసుల ఆశలను అడియాసలు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 67,840 మంది ఉద్యోగులకు ఎలాంటి మేలు చేకూర్చలేదని వాపోతున్నారు.
ప్రజల ఆశలను అడియాసలు చేసింది
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజల ఆశలను అడియాసలు చేసింది. ఏపీకి మళ్లీ మొండిచేయి చూపించింది. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన హామీలను పక్కన పెట్టింది. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థలకు కేటాయింపులు చేయలేదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి.
– వాడ గంగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి చిత్తూరు జిల్లా
ఆశలు..నిరాశే !
Comments
Please login to add a commentAdd a comment