![భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేక పూజలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07pgr22-300048_mr-1738982540-0.jpg.webp?itok=g6HlHX1X)
భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి రాహుకాల సమయం 10.30 నుంచి 12 గంటల మధ్య అభిషేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి విశేషాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఉభయకర్తలకు ఈఓ తీర్థప్రసాదాలను అందజేశారు.
23న గంటా కమలమ్మ సాహితీ పురస్కారం
చిత్తూరు కలెక్టరేట్ : గంటా కమలమ్మ సాహితీ పురస్కారం ప్రదాన కార్యక్రమం ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు శ్రీమతి గంటా కమలమ్మ సాహితీ పురస్కార ట్రస్టు నిర్వాహకులు గంటా మోహన్, గంటా రాజా, గంటా రాజేంద్ర తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని మిట్టూరులోని విజయం డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. గంటా కమలమ్మ స్మారక కవితా పురస్కారం – 2024 కు నిర్వహించిన పోటీకి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 35 కవితా సంపుటాలు అందాయన్నారు. న్యాయనిర్ణేతలుగా ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ రాధేయ (అనంతపురం), డాక్టర్ రఘు (హైదరాబాద్) వ్యవహరించారని వెల్లడించారు. పురస్కారానికి ‘నాలుగు రెక్కల పిట్ట (సాంబమూర్తి లండ, శ్రీకాకుళం), చింతల తొవ్వ’ (తుల శ్రీనివాస్, నల్గొండ, తెలంగాణరాష్ట్రం) ఎంపికయ్యారన్నారు. పురస్కార గ్రహీతలను రూ.10 వేల నగదు, జ్ఞాపికతో సత్కరించనున్నట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment