పకడ్బందీగా రుణాల మంజూరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్వయం ఉపాధి రుణాల మంజూరు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనారిటీలకు మెరుగైన జీవనోపాధుల కల్పనకు స్వయం ఉపాధి రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. రుణాల మంజూరులో బ్యాంకర్‌లు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకూడదన్నారు. బీసీ కార్పొరేషన్‌లో అర్హత ఉన్న ఈబీసీ, కమ్మ, రెడ్డి, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాల వారికి 50 శాతం సబ్సిడీ కింద రుణాలు మంజూరు చేస్తారన్నారు. బీసీ కార్పొరేషన్‌లో 2,800 యూనిట్లకు సబ్సిడీలో రూ.61.25 కోట్లు రుణాలు, మైనారిటీ కార్పొరేషన్లలో 916 క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలకు రూ.14 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, సాంఘీక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, మైనారిటీ శాఖ ఈడీ హరినాథరెడ్డి, ఎల్‌డీఎం హరీష్ పాల్గొన్నారు.
గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దు
జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు హౌసింగ్ శాఖ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ రానున్న మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన గృహ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాల పురోగతిపై ఈనెల 5న చిత్తూరు, నగరి నియోజక వర్గాలు, 6న పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమీక్షలో హౌసింగ్ పీడీ గోపాల్‌నాయక్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment