జనన పత్రానికి పురిటినొప్పులు!
● ప్రభుత్వాస్పత్రిలో నెలలు గడుస్తున్న అందని సర్టిఫికెట్లు ● పేర్లు, చిరునామా మార్పుల్లోనూ ఆలస్యం ● వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ ● పట్టించుకోని అధికారులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా ప్రభుత్వాస్పత్రిలో జనన ధ్రువీకరణ పత్రం పొందడానికి పురిటినొప్పులు పడుతున్నారు. తల్లుల చేతికి ప త్రం చేరేందుకు నెలలు గడుస్తోంది. పేర్లు, చిరు నామా, తండ్రి పేరులో మార్పునకు చుక్కలు చూపిస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత వేధిస్తోంది. దీంతో వైద్య సిబ్బందితో పత్రాల జారీ చేస్తూ, నెట్టుకొస్తున్నారు. జారీ ప్రక్రియ మధ్యాహ్ననానికే ఆగిపోతోంది. దీంతో జనన ధ్రువీకరణ పత్రం పొందడం తల్లులకు విషమ పరీక్షగా మారుతోంది. దరఖాస్తులు వేల సంఖ్యలో పెడింగ్ ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ సమస్య...
కొన్ని నెలలుగా జనన ధ్రువీకరణ పత్రాల జారీ తల్లిదండ్రులను అసహనానికి గురిచేస్తోంది. బిడ్డ పుట్టిన వెంటనే పత్రం కోసం తల్లిదండ్రులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి, తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, కాన్పు పత్రం జత చేసి సంబంధిత విభాగంలోని సిబ్బందికి అందజేస్తారు. వారు వాటిని ఆధారంగా చేసుకుని పత్రాలు జారీ చేయాలి. ఆరు నెలల క్రితం వరకు ఈ దరఖాస్తు ఫారంలోని వివరాల ఆధారంగా పత్రాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా ఆ పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి వస్తోంది. ఈప్రక్రియ సిబ్బందికి పనిభారం పెంచుతోంది. దీంతో పాటు ప్రధానంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కొరత పట్టిపీడిస్తోంది. గతంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ ఈ పత్రాల జారీని చూసేవారు. వారికి ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఈ ప్రక్రియ కాస్త చకచక నడిచేది. ఆరు నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ చంద్రగిరికి బదిలీ అయ్యారు. దీంతో ఆస్థానంలో ఎవరు నిలకడగా ఇమడలేకపోతున్నారు. ఇక ఈ పత్రాల జారీని ఓ హెడ్ నర్సు చేతిలో పెట్టారు. కొన్నాళ్ల తర్వాత ఆమె సెలవు పెట్టడంతో మరో స్టాప్‌నర్సుకు బాధ్యతలను అప్పగించారు. ఈ మధ్యలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులను కూర్చోపెట్టారు. దీంతో జారీ ప్రక్రియ అస్థవ్యస్థంగా తయారవుతోంది. డేటా ఎంట్రీ చేయాల్సిన పనులను వైద్య సిబ్బంది, విద్యార్థులకు అప్పగించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మూడు నెలలుగా తిరుగుతున్నా..
జిల్లా ఆస్పత్రిలోనే ప్రసవం చేసుకున్నా.. పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలని నవంబర్ 28వ తేదీన దరఖా స్తు చేసుకున్నాను. మూడు నెలలుగా తిరుగుతున్నాం. రేపు, మాపు అన్నారు. ఈరోజు కూడా వచ్చాం. ఇస్తారో..ఇవ్వరో తెలియదు. చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఒక్కో రోజు ఒక్కొక్కరు ఉంటారు. పర్మినెంట్‌గా ఒకరిని కేటాయిస్తే బాగుంటుంది.
– లావణ్య, ప్రశాంత్‌నగర్, చిత్తూరు
నిత్యం 40 నుంచి 50 ప్రసవాలు
చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిత్యం 40 నుంచి 50 ప్రసవాలు జరుగుతున్నాయి. ఆస్పత్రిలో పుట్టిన బిడ్డలకు ప్రసూతి విభాగంలోని మొదటి అంతస్తులో జనన ధ్రువీకరణ పత్రాల జారీ చేస్తుంటారు. గతంలో డేటా ఎంటీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ స్థాయి సంబంధించిన సిబ్బంది ఈ నమోదు ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి, పత్రాలు అందజేసేవారు. వారం రోజుల్లో తల్లిదండ్రుల చేతికి జనన ధ్రువీకరణపత్రాలు అందేవి. ప్రస్తుతం ఆ విభాగంలో పత్రాల జారీ గందరగోళంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment