చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఫైళ్లపై సంతకాలు పెట్టండి.. మేడమ్ అని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ఏ ఫైలు తీసుకెళ్లినా డీఎంఅండ్‌హెచ్‌ఓ సంతకాలు పెట్టడం లేదని కార్యాలయ అధికార వర్గం కోడైకూస్తోంది. ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చంద్రగిరిలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న సుధారాణిని చిత్తూరు జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓగా ప్రభుత్వం నియమించింది. అయితే ఈమె బాధ్యతల స్వీకరణ అనంతరం కార్యాలయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయని అధికారులు అంటున్నారు. తొలుత కొందరి వద్ద ఉన్న బాధ్యతలను వేరేవారికి అప్పగించారని చెబుతున్నారు. తెల్లకాగితంపై పేరు రాసి పంపితే తప్ప తలుపులు తీయడం లేదని పలువురు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు, మండల వైద్యాధికారులు, ఇతర అధికారులు వచ్చినా లోపలికి అనుమతించకుండా గడప వద్దకే వేచి ఉండేలా చూస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇలా గంటల కొద్ది తలుపు వద్ద వేచి ఉంటే పనులు ఎలా ముందుకు సాగుతాయని వాపోతున్నారు. అకౌంట్, పరిపాలన విభాగాలు, ప్రైవేటు ఆస్పత్రి అనుమతులకు సంబంధించిన ఫైళ్లల్లో సంతకాలు పడడం లేదని అధికారులు తలలు వాల్చేస్తున్నారు. ఆమె వద్దకు ఫైలు తీసుకెళ్లిన పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై డీఎంఅండ్‌హెచ్‌ను వివరణ కోరగా..ఫైలు పెండింగ్ ఎందుకు పెడుతాను. కలెక్టర్‌కు సమర్పించాల్సిన అన్ని ఫైళ్లను సకాలంలో సమర్పిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment