గాయపడిన జవాన్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య శనివారం మధ్యాహ్నం జరిగిన భీకరపోరులో ఎనిమిది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్, సుకుమా జిల్లాల సరిహద్దులోని జొన్నగూడ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జవాన్ల కాల్పుల్లో మహిళ సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు డీఆర్‌జీ, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికీ 21 మంది జవాన్ల ఆచూకీ దొరకలేదని, గల్లంతైనవారి కోసం ఉదయాన్నే సెర్చ్ అండ్ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి భారీ ఎత్తున అదనపు బలగాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
కూంబింగ్‌లో ఉండగా..
బీజాపూర్ జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యాప్ తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్, సుకుమా జిల్లాల నుంచి సరిహద్దులోని అటవీ ప్రాంతానికి డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాలు శుక్రవారం రాత్రి కూంబింగ్‌కు బయలుదేరాయి. ఆపరేషన్‌లో భాగంగా బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీజాపూర్, సుకుమా జిల్లాల సరిహద్దులోని జొన్నగూడ గ్రామం సమీపంలో పీఎల్‌జీఏ దళానికి చెందిన మావోయిస్టులు ఎదురుపడ్డారు. వెంటనే మావోయిస్టులు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు తేరుకుని ఎదురుకాల్పులకు దిగాయి. దాదాపు మూడు గంటలపాటు ఇరువైపులా భీకర కాల్పులు కొనసాగాయి. సాయంత్రం వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కోబ్రా విభాగానికి చెందిన ఒక జవాను, బస్తర్ ఎస్టీఎఫ్ విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లు, డీఆర్‌జీ విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఒక మహిళా మావోయిస్టు మృతదేహాన్ని పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
వెనక్కి వెళ్లిన హెలికాప్టర్లు..
కాల్పుల్లో గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించేందుకు రెండు ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చాయి. అయితే, అప్పటికి ఇంకా కాల్పులు కొనసాగుతుండటంతో వాటిని ల్యాండింగ్ చేయడం వీలుపడలేదు. దీంతో వాటిని తెర్రెం పోలీస్‌స్టేషన్ వద్ద ల్యాండింగ్ చేశారు. అనంతరం సుకుమా నుంచి 9 ప్రత్యేక అంబులెన్సులను సంఘటనా స్థలానికి పంపించి, గాయపడిన జవాన్లను తెర్రెం పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఏడుగురు జవాన్లను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ తరలించారు. కాగా, భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టులకు భారీగానే నష్టం కలిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నప్పటికీ.. ఒక్క మహిళా మావోయిస్టు మృతదేహం మాత్రమే లభ్యమైంది. మరోవైపు ఈ కాల్పుల ఘటనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోకి వచ్చే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లోని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు.
మందుపాతర పేలి మావోయిస్టు మృతి
మందుపాతరలను ఏర్పాటు చేయడంలో నిష్ణాతుడైన మావోయిస్టు.. అదే మందుపాతరకు బలయ్యాడు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. వాటికి భద్రతగా ఉంటున్న పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు మందుపాతరలను ఏర్పాటు చేయాలని మావోయిస్టులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో భైరంఘడ్ ఏరియా కమిటీలో మందుపాతరలను ఏర్పాటు చేయడంలో నిష్ణాతుడైన పద్దం సునీల్‌కు ఆ పని అప్పగించారు. అతడు మందుపాతరలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో అది పేలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
చదవండి: రైతుల ఉద్యమంలో నిరసనకారు డానికి కారణమేంటి?
చదవండి: టీఆర్‌ఎస్ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ
Comments
Please login to add a commentAdd a comment