అక్రమార్కుల ర్యాంపువాక్!
● గుడ్లప్పగించి చూస్తున్న అధికారులు
● అనధికార ర్యాంపులలో జోరుగా
ఇసుక అక్రమ తవ్వకాలు
● బిడ్‌లు ఖరారు చేసిన జిల్లా యంత్రాంగం
● స్టాక్ పాయింట్ల వద్ద నిర్ధారణ కాని ధర
● అధికారిక ర్యాంపుల్లో పూర్తిస్థాయిలో
తవ్వకాలకు మరో వారం పట్టే అవకాశం
● కాసులు వచ్చే ర్యాంపులను వదులుకోలేకపోతున్న కీలక నేతలు
● వారి వత్తాసుతోనే అడ్డగోలుగా తవ్వకాలు
● సిండికేటుదారుల ఒత్తిడితో
అడపాదడపా దాడులు
సాక్షి, అమలాపురం: జిల్లాలో గోదావరి నదీపాయల్లో ఎంపిక చేసిన ఇసుక ర్యాంపులకు టెండర్లు ఖరారయ్యాయి. ఇప్పటికే ఆయా ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు మొదలు కావాల్సి ఉన్నా జిల్లా యంత్రాంగం నాన్చుడు ధోరణి కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో అక్రమార్కులు మాత్రం చెలరేగిపోతున్నారు. కీలక నేతల దన్నుతో ఇసుక తవ్వకాల జోరు పెంచారు. అధికార ర్యాంపులు ప్రారంభమైనా శ్రీవెనక్కు తగ్గేదేలేశ్రీ అని అంటున్నారు.
జిల్లాలో 12 ర్యాంపులకు టెండర్లు ఖరారు కావడంతో ఈ నెల 16వ తేదీ నుంచి తవ్వకాలు మొదలు పెట్టాలని జిల్లాస్థాయి ఇసుక కమిటీ నిర్ణయించింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ గత నెల 14వ తేదీన ప్రకటించారు. కాని ఇప్పటికీ ఆయా ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు మొదలు కాలేదు. ఒకవైపు ఇసుకకు కొరత ఏర్పడి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పాలవుతున్నారు. నిర్మాణం రంగం దాదాపు నిలిచిపోయింది. నిర్మాణ పనులపై ఆధారపడిన పలు వ్యాపారాల సంస్థలలో అమ్మకాలు నెమ్మదించాయి. ఈ సమయంలో ర్యాంపుల నుంచి సాధ్యమైనంత త్వరగా ఇసుక తవ్వకాలు మొదలు పెట్టి వినియోగదారులకు అందించాల్సి ఉంది. కాని జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ర్యాంపులు దక్కించుకున్నవారు ఇంకా తవ్వకాలు మొదలు పెట్టలేదు. కారణాలు ఏమైనా ర్యాంపులలో తవ్వకాలకు పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదనే చెప్పవచ్చు. ప్రధాన అవరోధం.. రీచ్‌లకు అనుబంధంగా ఉన్న స్టాక్ పాయింట్‌లో ఎగుమతి చేసే ఇసుక ధర నిర్ణయించకపోవడమే. అందువల్లే తవ్వకాలు ఆలస్యమవుతున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో ఇసుక తవ్వకాలకు అనుగుణంగా ర్యాంపులలో బాటలు వేయడం, ఇతర సదుపాయాల కల్పనకు వేలం పాటలు సొంతం చేసుకునేవారు ఆ పనిలో నిమగ్నమయ్యారు.
ర్యాంపులు తెరిచినా అక్రమాలు ఆగేలా లేవు
జిల్లా ఇసుక కమిటీ గుర్తించిన 12 ర్యాంపులలో ఇసుక తవ్వకాలు అధికారికంగా మొదలైనా ఇసుక అక్రమ తవ్వకాలకు బ్రేకులు పడే పరిస్థితి లేదు. అక్రమార్కులకు అండగా నియోజకవర్గ స్థాయి నేతలు ఉండడం, వారికి ఏ రోజుకారోజు వాటాలు వెళుతుండడంతో అక్రమార్కులను అడ్డుకునేవారు లేకుండా పోయారు. ఇసుక కొరత పేరుతో ఇష్టానుసారం జరుగుతున్న అక్రమ తవ్వకాలకు కూటమి పెద్దల దన్ను ఉండడంతో అక్రమార్కులను అడ్డుకునేవారు లేకుండా పోయారు. ఈ పరిస్థితి చూసి వేలంలో ర్యాంపుల దక్కించుకున్నవారికి ఆందోళన అధికమవుతోంది. మరీ ముఖ్యంగా తక్కువకు టెండరు వేసి అడ్డుగోలుగా దోపిడీ చేద్దామనుకున్న వారికి ఇసుక కొరత లేకపోయినా.. సుదూర ప్రాంతాలకు రవాణా జరగకున్నా ర్యాంపులు గిట్టుబాటు కాకుండా పోతాయనే ఆందోళన నెలకొంది. దీంతో రెండు రోజులుగా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై ర్యాంపు యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ తవ్వకాలపై చిన్నచిన్నగా దాడులకు దిగుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం రాత్రి పి.గన్నవరం, సోమవారం అయినవిల్లిలో ఇసుక తవ్వకాలను అడుకుని ట్రాక్టర్లు, లారీలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమార్కుల బరితెగింపు
ఇదే అదనుగా అక్రమార్కులు మరింత బరి తెగించారు. ఈ నెల ఆరంభం నుంచి జిల్లాలో పలుచోట్ల ఇసుక అక్రమ తవ్వకాలు మొదలయ్యాయి. జిల్లాలో తొలుత ఆలమూరు మండలం జొన్నాడలో ఇసుక తవ్వకాలు మొదలు కాగా, తరువాత ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక, పులిదిండి, వద్దిపర్రు, అంకంపాలెం, రావులపాలెం మండలం గోపాలపురం, ఊబలంక, కొత్తపేట మండలం మందపల్లి, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కొండుకుదురు లంక, శానపల్లిలంక, వీరవల్లిపాలెం, ముమ్మిడివరం మండలం ఠాన్నేల్లంక, పి.గన్నవరం అన్నంపల్లి అక్విడెక్టు వద్దనే కాకుండా కె.గంగవరం, కాట్రేనికోన, మామిడికుదురు మండలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. చివరకు కోస్టల్ రెగ్యులరైజేషన్ జోన్ (సీఆర్‌జెడ్) పరిధిలో సైతం ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. స్థానికంగా నియోజకవర్గ స్థాయి నేతతో మాట్లాడుకోవడం.. సొంతంగా ర్యాంపులు వేసుకోవడం టీడీపీ, జనసేన చోటామోటా నేతలకు పరిపాటిగా మారింది. జిల్లా సాండ్ కమిటీ ఆధ్వర్యంలో గుర్తించిన ఇసుక ర్యాంపుల వద్ద కూడా అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. ఆలమూరు, తాతపూడి ర్యాంపు పేరుతో సరిహద్దులోని కొత్తపేట మండలం మందపల్లి వద్ద తవ్వకాలు చేస్తున్నారంటే అక్రమార్కుల బరి తెగింపును అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment