రైతు బజార్ పునఃప్రారంభానికి చర్యలు
అమలాపురం టౌన్: అమలాపురంలోని రైతుబజార్‌ను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. స్థానిక రైతు బజార్‌లో వివిధ మండలాలకు చెందిన రైతులతో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మూత పడిన రైతు బజార్‌ను తిరిగి తెరిచే అంశాలపై ఉద్యాన, మార్కెటింగ్, మత్స్యశాఖల అధికారుల సమక్షంలో రైతులతో చర్చించారు. జిల్లా ఇన్‌చార్జి డీఆర్‌వో కె.మాధవి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బీవీ రమణ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కె.విశాలక్షి సదస్సులో పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ అమలాపురం, రాయవరం రైతు బజార్ల సమస్యలను ఈ నెల 18న జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. దళారీలు లేకుండా కూరగాయలు, చికెన్, మటన్, చేపల దుకాణాలను నెలకొల్పాలన్నారు. ఇక్కడ కూరగాయలను విక్రయించుకునే రైతులకు అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
నేర పరిశోధనలో
టెక్నాలజీ వాడాలి
అమలాపురం టౌన్: నేర పరిశోధనలో సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. దీనిలో భాగంగా జిల్లాలోని అన్ని కూడళ్లలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖకు ఉన్న సీసీటీవీలకు తోడు అదనంగా జిల్లాలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించాలన్నారు. నూతన సంవత్సర సంబరాలు, సంక్రాంతి పండగ సమయంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఉండాలన్నారు. చోరీల రికవరీలు, నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తుల్లో వేగవంతం, నిందితులను త్వరిత గతిన అరెస్ట్ చేసిన సంఘటనలపై కూడా చర్చించి ఆయా సిబ్బందిని అభినందించారు. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగలకు పోలీస్ బందోబస్తుపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట డీఎస్పీలు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలతో పాటు ఎస్పీ కార్యాలయం స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్‌బీ సీఐ వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment