సాంకేతిక పద్ధతుల్లో నేర పరిశోధన
● సత్ఫలితాలనిస్తున్న కొత్త విధానం
● నేర సమీక్షలో ఎస్పీ కృష్ణారావు
అమలాపురం టౌన్: అందివచ్చిన సాంకేతికతతో చేస్తున్న నేర పరిశోధనలతో సత్ఫలితాలు సాధిస్తున్నామని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో ఆయన 2024లో పలు విభాగాల క్రైమ్ కేసుల ప్రగతిని వివరించారు. రోడ్డు ప్రమాదాలు 27 శాతం మేర తగ్గాయని ఎస్పీ వివరించారు. జిల్లా మొత్తం మీద క్రైమ్ రేటు 0.82 శాతం మేర స్వల్పంగా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా 2024 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను జిల్లా పోలీస్ శాఖ అత్యంత సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. నేర పరిశోధనలో డ్రోన్‌ల వ్యవస్థను విప్లవాత్మకంగా తీసుకు వచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌కు డ్రోన్ నిర్వహణపై మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామన్నారు. గత ఏడాది జిల్లాలో 6,818 కేసులు నమోదైతే, ప్రస్తుతం 6,874 మేర కేసులు వచ్చాయన్నారు. గత సంవత్సరంలో హత్యలు 24 జరిగితే, ఈ ఏడాది కేవలం 9 మాత్రమే జరిగాయని వివరించారు. ఆస్తుల చోరీల కేసులకు సంబంధించి గత ఏడాది 499 కేసులు నమోదైతే, ప్రస్తుతం 404 కేసులు నమోదయ్యాయని అన్నారు. అత్యాచార కేసులు గత సంవత్సరం 57 జరిగితే, ప్రస్తుత ఏడాది 46 జరిగాయన్నారు. పోక్సో కేసులు గతంలో 58, ఇప్పుడు 40 నమోదయ్యాయని అన్నారు. సైబర్ నేరాలు అప్పట్లో 80 జరిగితే, ఈ ఏడాది 44 జరిగాయన్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ కేసు, పామర్రు మండలం యర్రపోతవరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమాన కేసుల్లో జిల్లా పోలీస్ శాఖ అత్యంత పకడ్బందీగా రికవరీ, నిందితుల అరెస్ట్ విషయాల్లో చూపిన చొరవకు రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా రెండు సార్లు ఏసీబీడీ అవార్డులను ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు అందుకున్నారు. పలు కేసుల దర్యాప్తులో అత్యంత పరిశోధనాత్మకంగా పని చేసి నిందితులను అరెస్ట్ చేసి ఆస్తులను రికవరీ చేసిన జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలకు ఎస్పీ కృష్ణారావు, ఏఎస్పీ ప్రసాద్‌లు రివార్డులు అందజేశారు. ఇందులో స్పెషల్ బ్రాంచ్ సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్‌బీ సీఐ వి.శ్రీనివాస్, రాజోలు సీఐ టీవీ నరేష్, కొత్తపేట ఎస్సై జి.సురేంద్ర, మండపేట టౌన్ ఎస్సై హరికోటిశాస్త్రి, ఆలమూరు ఎస్సై అశోక్, జిల్లా ఆర్మ్‌డ్ ఆర్‌ఐ ఎన్.బ్రహ్మానందం, క్రైమ్ టీమ్ ఎస్సై కె.ప్రవీణ్‌కుమార్, ఎస్పీ కార్యాలయ ఏఓ జగన్నాథం, కమ్యూనికేషన్ ఏఎస్‌ఐ రాజ్‌ప్రకాష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment