ఇసుక అక్రమ ర్యాంపు నిలిపివేయండి
పి.గన్నవరం: ఎల్.గన్నవరం గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపును తక్షణమే నిలిపివేయాలని, నదీ కోత నుంచి తమ గ్రామాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో పాటు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు బుధవారం మళ్లీ ఆందోళన చేశారు. ఆ ర్యాంపు నుంచి వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను వేమనవారిపాలెం వద్ద అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ర్యాంపును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కూటమి నేతలు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమంగా ఇసుకను తీసి, విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ వరదల సమయాల్లో తమ ఎల్.గన్నవరం గ్రామం నదీ కోతకు గురవుతుందని, విలువైన భూములు నదీపాతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వెనుక వైనతేయ నదీపాయలో వారం రోజులుగా అనధికారికంగా ర్యాంపును ఏర్పాటు చేసి, అక్రమంగా ఇసుకను తరలించుకు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాము ట్రాక్టర్లను అడ్డగించి హెచ్చరించినా ఆగకుండా మళ్లీ యథావిధిగా ఇసుకను తీస్తున్నారని వివరించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. గ్రామంలో ఇసుక ర్యాంపులను నిలిపివేయాలని, నదీకోత నివారణకు గ్రోయిన్లు నిర్మించాలని పంచాయతీలో తీర్మానం చేయాలని కోరుతూ సర్పంచ్ పసలపూడి రామకృష్ణకు వారు వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూ అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు లంకే చిరంజీవి, టీడీపీ, జనసేన నాయకులు గనిశెట్టి ఈశ్వర్, కొండపల్లి అబ్బు, యన్నాబత్తుల సతీష్, కాలా శ్రీను, గూటం సునీల్‌వర్మ, కృష్ణంరాజు, సీహెచ్.రమేష్, వి.గంగాధర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ట్రాక్టర్లను అడ్డుకుని
కూటమి నేతలు, గ్రామస్తుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment