విషాదం మిగిల్చిన విహారం
● గుజరాత్‌లో ఇద్దరు కొవ్వూరు విద్యార్థుల మృతి
కొవ్వూరు: విహారయాత్ర రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గుజరాత్‌లోని వాటర్ ఫాల్స్ వద్దకు విహారయాత్రకు వెళ్లి ఫొటో తీసే ప్రయత్నంలో జారిపడి కొవ్వూరుకు చెందిన రంభ రవితేజ (20), మండలంలోని వేములూరుకు చెందిన రాయిపాటి రోహిత్ (20) అనే ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. వారిద్దరూ గుజరాత్ రాష్ట్రంలోని వడోదర పారూల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. స్నేహితులతో కలసి మంగళవారం వాటర్ ఫాల్స్ వద్ద విహారయాత్రకు వెళ్లారు. రవితేజ ఫొటో తీస్తూ జారి పడుతుండడంతో రోహిత్ చేయి అందించి పట్టు కునే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తూ ఇద్దరూ వాటర్‌ఫాల్స్‌లో పడ్డారు. బండరాయిపై వెనక్కి పడిన రవితేజ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్టు చెబుతున్నారు. రోహిత్ మృతదేహం మట్టిలో కూరుపోయి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు లభ్యమైనట్టు తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గుజరాత్ బయల్ధేరి వెళ్లారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ విషయాన్ని బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడికి, అక్కడి కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహాలను త్వరితగతిన కొవ్వూరు రప్పించే ప్రయత్నాలు చేయాలని ఎంపీ సూచించారు. రవితేజ హోమ్ సిక్‌తో ఇటీవల ఇంటికి వచ్చి 20 రోజులపాటు కొవ్వూరులోనే ఉన్నాడు. రవితేజకు సోదరి, తల్లిదండ్రులు ఉన్నారు. రోహిత్ చదువు కోసం తల్లిదండ్రులు కూడా గుజరాత్‌లోనే ఉంటున్నారు. పొలంలో చెరకు నరుకు ఉండడంతో ఇటీవలే రోహిత్ తండ్రి గోవిందరాజు వేములూరు వచ్చారు. ఇంతలోనే విషాద వార్త విని మళ్లీ గుజరాత్ పయనమయ్యారు. రోహిత్‌కి తల్లిదండ్రులతో పాటు ఒక సోదరి ఉన్నారు. రోహిత్ అమ్మమ్మ స్వస్థలం కొవ్వూరు. దీంతో ఇటు వేములూరులోను, అటు కొవ్వూరులోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
వుమెన్ క్రికెట్ పోటీలు ప్రారంభం
రాజానగరం: స్థానిక ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నిర్వహించే వుమెన్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలల నుంచి హాజరైన క్రీడాకారుల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 15 మందిని యూనివర్సిటీ జట్టుగా ఎంపిక చేశారు. వచ్చే నెల 15 నుంచి మైసూరు యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో వీరు పాల్గొంటారని స్పోర్ట్స్ బోర్డు ఇన్‌చార్జి సెక్రటరీ, రిజిస్ట్రార్ జి.సుధాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment