మామూళ్ల పేలుళ్లు!
వ్యాపారుల బేజారు
ఒకవైపు అధికారులు, మరో వైపు కూటమి నేతల మామూళ్ల ఒత్తిళ్లతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజుల వ్యాపారానికి రూ.వేలల్లో సమర్పించుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో రోజు వ్యాపారం చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఒక్కో దుకాణ యజమాని రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల విలువైన సరకు తీసుకువస్తున్నారు. గతంలో కనీసం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు లాభం వచ్చేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతల ధనదాహం పరాకాష్టకు చేరింది. ఇప్పటికే మట్టి అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొట్టారు. మద్యం మాఫియా అవతారం ఎత్తారు. అనధికారిక బెల్టు షాపులతో రూ.లక్షలు గడిస్తున్నారు. ఇది చాలదన్నట్టు దీపావళి పండగను ఆసరాగా చేసుకున్నారు. అనుకున్నదే తరువాయి రంగంలోకి దిగారు. కొన్ని ప్రాంతాల్లో బాణసంచా దుకాణాల ఏర్పాటుపై కన్నేశారు. దుకాణానికి ఓ ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడ్డారు. తమకు మామూళ్లు ముట్టజెప్పితే చాలు.. అన్నీ తాము చూసుకుంటామని బాణసంచా వ్యాపారులకు భరోసా ఇచ్చారు. ఒక్కో దుకాణం నుంచి దుకాణం స్థాయి, సరకును బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దుకాణాలకు అనుమతులు మంజూరు చేసే అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసులు సైతం వసూళ్లకు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా దీపావళి మామూళ్ల టపాసులు భారీగా పేలినట్టు సమాచారం. రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, నియోజకవర్గాల్లో ఈ తంతు యథేచ్ఛగా సాగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో ఇలా..
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 388 దుకాణాలకు అధికారిక అనుమతులు అందాయి. రాజమహేంద్రవరం డివిజన్‌లో 263, కొవ్వూరు డివిజన్‌లో 125 దుకాణాలకు అధికారులు అనుమతులు జారీ చేశారు. ఒక్క రాజమహేంద్రవరం నగరంలోని ఆర్ట్స్‌కళాశాల, వీఎల్‌పురం తదితర ప్రాంతాల్లో 144 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఉండ్రాజవరం, మీనానగరం –పంగిడి సరిహద్దు, కొమరిపాలెం, బిక్కవోలు, తొస్సిపూడి, రాధేయపాలెం తదితర గ్రామాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సైతం పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. అగ్నిమాపక అధికారులు ఇప్పటి వరకు తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్న విమర్శలున్నాయి.
రెన్యువల్‌కు ఓ ధర.. లైసెన్సుకో ధర
బాణసంచా విక్రయ దుకాణాల పాత లైసెన్స్‌లకు గాని.. కొత్త లైసెన్సులు, గోదాములు, తయారీ కేంద్రాలకు సంబంధించి నిర్వాహకులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాలు, ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.550 మాత్రమే. ఈ ఆదేశాలేవీ అమలవడం లేదు. అధికారులు అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. లైసెన్స్ రెన్యువల్ అయితే ఓ ధర.. కొత్త లైసెన్సులకు మరో ధర.. లైసెన్స్ లేకుండానే నిర్వహించుకునేందుకు ఓ ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన 388 దుకాణాలకు దుకాణం స్థాయిని బట్టి లైసెన్సు జారీకి ఒక్కో దుకాణానికి రూ.6వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవికాకుండా బాణసంచా తయారీ గోదాములకు వాటి పరిమితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు నిర్ణయించి మరీ దండుకున్నట్టు తెలిసింది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా బాణాసంచా దుకాణాలు, గోడౌన్లు, తయారీ కేంద్రాల నుంచి రూ.లక్షలు కొల్లగొట్టినట్లు సమాచారం.
నిబంధనలకు తిలోదకాలు
బాణసంచా విక్రయాలు నిర్వహించే దుకాణాల వద్ద నిబంధనలకు నీళ్లొదిలారు. రాజమహేంద్రవరం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం, స్టేడియం రోడ్డు తదితర కేంద్రాల్లో అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదు. మంటలు అంటుకుంటే వాటిని ఆపేందుకు అవసరమైన ఫైర్‌స్టేఫ్టీ సిలిండర్లు కేవలం కొన్ని దుకాణాల వద్ద మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఫైర్ ఇంజిన్లు కూడా కేంద్రాల వద్ద కనిపించడం లేదు. ప్రమాదాల నివారణకు అందుబాటులో నీరు, ఇసుక, అగ్నిమాపక నియంత్రణ పరికరాలు కచ్చితంగా ఉపయోగించాల్సి ఉంది. మామూళ్ల దండుకున్న అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు.
నాటి సందడేదీ..?
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళి సందడి తగ్గింది. గతంలో మూడు రోజులకు ముందుగానే బాణసంచా కొనుగోళ్లు ఊపందుకునేవి. ప్రస్తుతం ధరలు బాగా పెరగడం, ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో మార్కెట్లో దీపావళి సందడి కనిపించడం లేదు.
సర్కారు వారి దీపావళి దందా
ఒక్కో దుకాణానికి
ఒక్కో ధర నిర్ణయించి మరీ వసూళ్లు
కూటమి నేతలు,
అధికారులు కలిసి యథేచ్ఛగా..
రూ.10 వేల నుంచి
రూ.40 వేల వరకూ రేటు ఫిక్స్
అడిగినంత ఇస్తే అన్నీ
తామే చూసుకుంటామని భరోసా
జిల్లా వ్యాప్తంగా
388 షాపులకు అనుమతులు
రాజమహేంద్రవరం
నగరంలోనే 144 దుకాణాలు
Comments
Please login to add a commentAdd a comment