గోదావరిలో మురుగు నీరు కలవడమా..?
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో మురుగునీరు కలవడం బాధాకరమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ ఆవేదన చెందారు. గోదావరి గట్టు వద్ద శ్రీ మార్కండేయస్వామి ఆలయంలో స్వామి వారికి భరత్, మోనా దంపతులు బుధవారం లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడారు. కార్తిక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిరోజూ వేలమంది మంది ఘాట్లకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారని, ఇలా డ్రైనేజీ నీరు కల్సిన చోట ఎలా స్నానం చేస్తారని ప్రశ్నించారు. గోదావరి నదిలో మురుగునీరు కలవకుండా కోటిలింగాల ఘాట్ నుంచి డెడికేటెడ్ చానల్ ద్వారా రాతి చానల్‌కు మురుగునీరు రామకృష్ణ థియేటర్ వెనుక ఉన్న ప్రాంతానికి చేరి ఎస్‌టీపీకీ వెళుతుందన్నారు. నగరంలో విడుదలయ్యే మురుగు నీరు అంతా రాతి చానల్ ద్వారా ఆవ ప్రాంతంలోని ఎస్టీపీ డ్రైనేజీకు మళ్లించాలన్నారు. కేవలం వరదలు, వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే గోదావరిలోకి నీటిని వదులుతారన్నారు. అలాంటిది ప్రస్తుతం వదిలేస్తుండటం దారుణమన్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రస్తుత ప్రజాప్రతినిధుల అవగాహన లోపంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరుగుతుంటే అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ఒకపక్క స్నానాలు చేస్తుంటే, మరోపక్క డ్రైనేజీ వాటర్‌ని నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారన్నారు. ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇక్కడ పూజ చేయడానికి వస్తేనే దుర్వాసన వస్తోందని, అసలు ఎందుకు వచ్చాంరా బాబు అనిపిస్తోందని ఆయన అన్నారు. ఎన్నో గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇలా చేయడం దారుణమన్నారు. మురుగు నీటిలో స్నానం చేస్తే జబ్బులు రావడం ఖాయమన్నారు. ఇప్పటికై నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘాట్లను శుభ్రం చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కలెక్టర్, కమిషనర్ తక్షణం ఘాట్‌లకు వచ్చి పరిశీలించాలని కోరారు.
అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అవగాహన లోపంతోనే దారుణం
కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది?
గతంలో వర్షం వచ్చినప్పుడు
మాత్రమే నీరొదిలేవారు
ఈ దుర్భాగ్య పరిస్థితి చక్కదిద్దండి
మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర
కార్యదర్శి మార్గాని భరత్‌రామ్ ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment