ఏం జరుగుతోందబ్బా..
రాయవరం: సీఐడీ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖీలు చర్చనీయాంశమయ్యాయి. రాయవరం మండలం చెల్లూరులోని శ్రీసర్వారాయ షుగర్ ఫ్యాక్టరీలో సోదాలు చేశారు. విశాఖపట్నం నుంచి సీఐడీ అధికారులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో బందోబస్తు కోసం సంప్రదించినట్లు తెలిసింది. బుధవారం ఉదయం వరకూ ఎక్కడ విచారణ జరుపుతుందీ కూడా గోప్యంగా ఉంచి, ఉదయాన్నే చెల్లూరు సర్వారాయ షుగర్ ఫ్యాక్టరీకి వెళ్లారు. సుమారు ఐదుగురు అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఉదయం లోపలకు ప్రవేశించిన వారు రాత్రి 7.30 గంటల వరకూ సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. షుగర్ ఫ్యాక్టరీ మూతపడి ఉండగా, డిస్టలరీలో మొలాసిస్ ఉత్పత్తి అవుతున్నట్లుగా సమాచారం. మొలాసిస్‌ను ఫిల్టర్ చేస్తే ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ) ఉత్పత్తి అవుతుంది. అయితే ప్రస్తుతం సీఐడీ అధికారులు చేస్తున్న సోదాలు ఈఎన్‌ఏ ఉత్పత్తికి సంబంధించినదా? కాదా? అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఇక్కడ ఉత్పత్తయిన స్పిరిట్ ఏ ఏ ప్రాంతాలకు సరఫరా చేశారనే విషయాలపై ప్రధానంగా రికార్డులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై రాయవరం ఎస్సై పి.బుజ్జిబాబును వివరణ కోరగా, తన వద్ద ఎటువంటి సమాచారం లేదన్నారు.
ఏకకాలంలో దాడులు
తాళ్లపూడి: మండలంలోని తుపాకులగూడెం రెవెన్యూ పరిధిలో రెండు బెవరేజస్ ఫ్యాక్టరీలపై బుధవారం ఏకకాలంలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9 గంటల సమయానికి రెండు బృందాలుగా వచ్చి రెండు ఫ్యాక్టరీల్లోకి సీఐడీ అధికారులు వెళ్లారు. విజయవాడకు చెందిన సీఐడీ అధికారులు కేప్రికార్న్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా బీ9 బెవరేజస్ లిమిటెడ్ (బీర్) ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేపట్టారు. వారితో పాటు రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇతరులను లోపలకు అనుమతించలేదు. ఎటువంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. సాయంత్రం వరకూ తనిఖీలు కొనసాగాయి. పలు రికార్డులను పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం విజయవాడలోని కార్యాలయానికి అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఎంఎం బయోటెక్‌లో..
నల్లజర్ల: మండలంలోని ఆవపాడు సమీపంలోని ఎంఎస్ బయోటెక్ ఫ్యాక్టరీలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ తయారైన ఎగస్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌కు సంబంధించి ఏ డిస్టలరీకు ఎంత మొత్తంలో వెళ్లిందనే విషయాలు, రికార్డులను తనిఖీ చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సోదాలు సాయంత్రం 6 గంటల వరకూ జరిగాయి. సీఐడీ డీఎస్పీ (రాజమహేంద్రవరం)వై.శ్రీనివాసరావు, పీఏ వెంకటేశ్వరావు, ఎస్‌ఐ ఫణికుమార్, ఎకై ్సజు సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో సీఐడీ సోదాలు
ఉదయం నుంచి రాత్రి వరకూ తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment