న్యాయం చేయాలని వేడుకోలు
అమలాపురం టౌన్: అమలాపురం కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అంబాజీపేటకు చెందిన ఓ యువతి తనకు న్యాయం చేయండంటూ వేడుకుంది. ఆ యువతి ఏడేళ్ల నాటి తన ప్రేమ పెళ్లి విషయంలో జరిగిన మోసాన్ని, పోలీసులు పెడుతున్న ఇబ్బందులను ఆ ప్రజాప్రతినిధులకు వివరించింది. సమావేశానంతరం ఎంపీ గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావులకు తనకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని చెప్పింది. 2017లో గౌస్ మొహిద్దీన్ అనే యువకుడు, తాను ప్రేమించుకున్నామని తెలిపింది. అతను పెళ్లికి నిరాకరించడంతో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించానని చెప్పింది. పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో ఆ యువకుడికి, తమకు అప్పటి ఎస్సై ఆర్.భీమరాజు సమక్షంలో పెళ్లి చేశారని పేర్కొంది. కేవలం 20 రోజులు తనతో ఉండి అతను తనను విడిచి వెళ్లిపోయాడని తెలిపింది. అప్పట్లో ఇదే సమస్యపై అంబాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చాన్నాళ్లు ఎఫ్‌ఐర్ నమోదు చేయలేదని ఆరోపించింది. తర్వాత కొన్నేళ్లకు ఎఫ్‌ఐఆర్ వేసి కేసు నమోదు చేశారని పేర్కొంది. అప్పటి నుంచి కోర్టులో న్యాయం కోసం పోరాడుతున్నానని వివరించింది. అయితే అంబాజీపేట పోలీసులు ఇప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలని పదే పదే తనపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పింది. కోర్టులో అప్పటి ఎస్సై భీమరాజుపై కేసు వేయగా ఇప్పుడు ఛార్జీషీట్‌లో ఆయన పేరు లేకపోవడాన్ని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వివరించింది. దీంతో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అంబాజీపేట పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి ఆ యువతి ఆవేదనను వివరించారు. న్యాయం జరిగేలా చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆమెకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment