దళిత యువకులపై దాడి
● ఆలయంలో ఇద్దరి నిర్బంధం
● దుశ్చర్యకు పాల్పడిన
అగ్రవర్ణాల యువకులు
● ఘటనపై దళిత నాయకుల ధర్నా
● ఎనిమిది మందిపై కేసు నమోదు
మండపేట: సినిమా థియేటర్‌లో పార్క్ చేసిన బైక్ పడిపోవడంతో తలెత్తిన స్వల్ప వివాదం కొట్లాటకు దారి తీసింది. ఆగ్రహించిన అగ్రవర్ణాల వారు దళితులపై దాడికి దిగి ఇద్దరిని బలవంతంగా తమ స్వగ్రామానికి తీసుకువెళ్లి గుడిలో నిర్బంధించారు. దాడికి పాల్పడిన వారిలో జనసేన నాయకులు కూడా ఉన్నారు. దీంతో ఎమ్మార్పీఎస్, మాలమహానాడు నాయకులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులు రంగంలోకి దిగి నిర్బంధించిన వారిని విడిపించడమే కాకుండా, ఎనిమిది మంది అగ్రవర్ణాల వారిపై కేసులు నమోదు చేశారు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
బైక్ విషయంలో..
మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన కొందరు యువకులు గురువారం మండపేటలోని సత్యశ్రీ థియేటర్‌లో మార్నింగ్ షోకు వెళ్లారు. తాము వేసుకొచ్చిన పల్సర్ బైకును పార్కింగ్‌లో ఉంచారు. మేట్నీ చూసేందుకు పట్టణానికి చెందిన పది మంది రెల్లి కులస్తులు ముందుగానే ఆ థియేటర్‌కు వచ్చారు. వారిలో ఓ మహిళ పల్సర్ బైక్‌పై కూర్చోవడంతో అనుకోకుండా ఆ బైక్ కింద పడిపోయింది. ఆమె అన్నయ్య బొచ్చా మోహన్ కిరణ్ ఆ బైక్‌ను పైకి లేపి యథాస్థానంలో ఉంచి సినిమాకు వెళ్లారు. మార్నింగ్ షో నుంచి వచ్చిన బైక్ తాలూకా యువకులు తమ బైక్ డ్యామేజ్ అయినట్టు గుర్తించారు. దీనిని ఎవరు పడేశారో తెలుసుకుని మేట్నీ షో ఇంటర్వెల్ వరకూ నిరీక్షించారు. ఈలోపు బయటకు వచ్చిన మహిళను నిలదీసి డ్యామేజీకి మరమ్మతు చేయించాలని డిమాండ్ చేశారు. ఆమె ఒప్పుకోవడంతో గుమ్మిలేరు రోడ్డులోని ఓ షోరూమ్‌కు బైక్‌ను తీసుకువెళ్లారు. ఈలోపు బైక్ యజమానులకు, పడేసిన వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ దాడిలో తొలుత ఏడిద గ్రామానికి బైక్ యజమాని కింద పడిపోవడంతో తన స్నేహితులకు కబురు పంపాడు. ఆ గ్రామం నుంచి కొంతమంది యువకులు మండపేట షోరూమ్ వద్దకు చేరుకోవడంతో గొడవ పెద్దదై కొట్టుకున్నారు.
మండపేట పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన
ఈ ఘర్షణలో బొచ్చా మోహన్ కిరణ్, కొల్లి చంటి, పాలపర్తి చంద్రశేఖర్ అనే దళిత యువకులు గాయపడ్డారు. వారిలో పాలపర్తి శేఖర్, కొల్లి చంటిలను బైక్ యజమాని వర్గీయులు తమతో ఏడిద తీసుకువెళ్లిపోయారు. గ్రామంలోని వినాయకుని ఆలయంలో వారిని నిర్బంధించి అక్కడున్న అగ్రవర్ణ యువకులందరూ దాడి చేశారు. కాగా.. షోరూం దగ్గర జరిగిన గొడవలో బాధితుడైన కిరణ్ ఆ విషయాన్ని తమ పెద్దలకు తెలియజేశాడు. దీంతో ఎమ్మార్పీఎస్ నాయకుడు దూలి జయరాజు, మాలమహానాడు నాయకులు వెంటపల్లి జాన్‌మార్క్, పాలపర్తి సురేష్ కన్నా, కొవ్వాడ అప్పన్న బాబు, సీఐటీయూ నాయకురాలు కె.కృష్ణవేణి తదితరులు మండపేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. వారికి ఎస్సై హరికోటిశాస్త్రి సర్దిచెప్పారు. దీనిపై సీఐ దొరరాజు మాట్లాడుతూ ఘటనపై విచారణ చేపట్టామని, తక్షణ చర్యల్లో భాగంగా 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. దాడి చేసిన అగ్రవర్ణ నిందితుల్లో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment