దీపావళి వేళ మృత్యు తాండవం
● శలపాకలో ముగ్గురి దారుణ హత్య
● కుటుంబ తగాదాలే కారణం
● దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాజులూరు: దీపావళి పండగను అందరూ ఉత్సాహంగా జరుపుకొంటున్న వేళ.. ఆ గ్రామంలో మృత్యువు తాండవం చేసింది. బాణసంచా వెలుగులు విరజిమ్మాల్సిన సమయంలో రక్తం పారింది. గ్రామ ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ తెల్లవార్లూ కాలం గడిపారు. కాజులూరు మండలం శలపాకలో గురువారం రాత్రి ఈ విషాద సంఘటన జరిగింది. గ్రామంలోని చిన్నపేటకు చెందిన పొట్లకాయల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎదుట ఇంటిలో ఉంటున్న బత్తుల చిన్నయ్య, అతడి కుమారుడు రమేష్, సోదరులు రాజు, శ్రీనుపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో బత్తుల చిన్నయ్య (56), బత్తుల రాజు (49), బత్తుల రమేష్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. బత్తుల శ్రీను తీవ్ర గాయాలతో అక్కడి నుంచి పారిపోయాడు.
అసభ్య ప్రవర్తనే కారణం
పొట్లకాయల నాగేశ్వరరావు భార్య బేబీని బత్తుల చిన్నయ్య కొంత కాలంగా దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంపై చిన్నయ్యను పలుమార్లు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మందలించినా అతడిలో మార్పు రాటేదు. దీపావళి రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో గ్రామస్తులందరూ బాణసంచా కాల్చుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఆ సమయంలో మద్యం తాగి వచ్చిన చిన్నయ్య మరోసారి నాగేశ్వరరావు భార్యపై అభ్యంతరకరంగా మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో నాగేశ్వరరావు, అతడి భార్య బేబీ, కుమారులు సుబ్రహ్మణ్యం, దొరబాబు, వినోద్ కుమార్ విసుగు చెంది బత్తుల చిన్నయ్యపై దాడి చేశారు. అడ్డుగా వచ్చిన అతడి కుమారుడు, సోదరులను విచక్షణా రహితంగా కొట్టారు. ఆ సమయంలో గ్రామంలో విద్యుత్ పోవడంతో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో కూడా స్థానికులకు అర్థం కాలేదు.
పరారీలో ముగ్గురు నిందితులు
విద్యుత్ వచ్చే సరికి చిన్నయ్య, రాజు, రమేష్ మృతదేహాలు వీధిలో చెల్లాచెదురుగా పడిఉన్నాయి. విషయం తెలుసుకున్న గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు పొట్లకాయల నాగేశ్వరరావు, అతడి కుమారుడు సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్, పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, 144 సెక్షన్ అమలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment