వరి సిరులై కురిసె..
దిగుబడులు బాగున్నాయి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో వరి దిగుబడులు చాలా వరకు రైతులు ఆశించిన మేరకు వస్తున్నాయి. జిల్లాలో 4.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లక్ష్యాన్ని సులువుగానే చేరుకోగలం. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ఆరు వేల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. అడపా దడపా కురుస్తున్న వర్షాలు కంగారు పెడుతున్నప్పటికీ పంట కోతలు చేపడిదతే సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి, ధాన్యాన్ని కళ్లాల్లో లేకుండా జాగ్రత్త పడాలి. అవకాశం ఉన్నంత మేరకు మార్కెట్‌కి తరలించడం లేదా, కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లకు పంపించాలి.
– ఎస్.మాధవరావు,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
రాజానగరం: ఆరుగాలం శ్రమించి పంటలు పండిచే అన్నదాతలకు ఆయా పంటల నుంచి ఆశించిన దిగుబడులు వస్తుంటే ఆనందానికి అవధులు ఉండవు. జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాలలో ఇదే పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి పిలువకుండానే పలుకరిస్తున్న వరుణుడితో ఎన్నో లాభనష్టాలను ఎదుర్కొంటూ సహనంతో సాగు చేసిన రైతన్నలు ప్రస్తుతం మంచి దిగుబడులు అందుకుంటున్నారు. ఈ సమయంలో కూడా తుపాన్లు, అల్పపీడనాలు అలజడి రేపుతున్నా ఏ మాత్రం చెక్కుచెదరకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పంటను జాగ్రత్త చేసుకునే ప్రయత్నంలో తలమునకలవుతున్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 71,600 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. వీటి నుంచి 4.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కాగా, ఇప్పటి వరకు జిల్లాలో 6 వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి. ఎకరానికి 38 నుంచి 40 బస్తాలు దిగుబడి (75 కిలోలు) వస్తుంది. ఈ క్రమంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా రెండు, మూడు వారాల్లో కోతలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గోదావరికి అవతల ఉన్న నర్లజర్ల, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, దేవరపల్లి, గోపాలపురం, ఇవతల ఉన్న సీతానగరం, రాజమహేంద్రవరం, కడియం, రాజానగరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలలో వరి కోతలు యంత్రాల సాయంతో ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటితో పాటు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కాకినాడ జిల్లాలోని మురారి, గండేపల్లి, జగ్గంపేట ప్రాంతాలలోను వరి పంట కోతలు చేపట్టారు.
ఒడిదుడుకుల నడుమ సాగు
ఈ ఖరీఫ్ సీజన్‌లో తుపానులు, అల్పపీడనాల ప్రభావంతో అవసరానికి మించి వర్షాలు కురియండంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల సాయంతో జూన్ నెలాఖరు నాటికే చాలా మంది రైతులు వరి నాట్లు వేయడం పూర్తి చేశారు. ఆ తరువాత కొద్ది ఆలస్యంగా నాట్లు పడిన చోట జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలు, ముంపులు రైతులను ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా సెమీ డెల్టా సిస్టమ్ ఏరియాగా భావించే కొన్ని ప్రాంతాలు ముంపునకు గురై, వరి నాట్లు దెబ్బతిన్నాయి. ఎర్రకాలువ, కొవ్వాడ కాలువలతో పాటు గోదావరి వరద నీరు ఎగదన్నడంతో సీతానగరం, కోరుకొండ మండలాలలోని వందలాది ఎకరాలలో వరి నాట్లు మునిగిపోయాయి. అలాగే కంసారివారి పాలెం, నిడదవోలు పరిసర ప్రాంతాలలో వేసిన వరి నాట్లు కూడా దెబ్బతిన్నాయి. దీనితో ఆయా ప్రాంతాలలోని రైతులు వ్యవసాయాధికారుల సూచనల మేరకు మరోసారి వరి నాట్లు వేయవలసివచ్చింది. ఈ నేపద్యంలో 150 రోజులలో దిగుబడులు వచ్చే వరి వంగడాలను కాకుండా 120 రోజుల్లోనే కోతకు వచ్చే స్వల్పకాలిక వరి వంగడాలను సాగు చేశారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో వరి పంట గింజ కట్టే దశలో ఉంది. ఇక్కడ కూడా రైతులు ఆశించినట్టు ఎకరాకు 40 బస్తాల పైబడి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
యంత్రాలతో వరి కోతలు
ముమ్మరంగా ఖరీఫ్ కోతలు
ఆశాజనకంగా దిగుబడులు
ఎకరాకు 38 నుంచి 40 బస్తాలు
జిల్లాలో 4.42 లక్షల మెట్రిక్
టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
Comments
Please login to add a commentAdd a comment