కాకినాడ క్రైం: నర్సింగ్ పోస్టుల భర్తీలో అవకతవకలపై అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వెలుగులోకి వస్తోంది. కాకినాడ జీజీహెచ్ మేనేజర్ వైవీఎస్‌ఎన్ నరసింగరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మంగళవారం విజయవాడ నుంచి రాష్ట్ర డీఎంఈ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం ఆరా తీయడం చర్చనీయాంశమైంది. సూపరింటెండెంట్‌తో మాట్లాడి పూర్తి పారదర్శకంగా విచారణ జరగాలని ఆదేశాలిచ్చారు. గత కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించిన నరసింగరావు వ్యవహారశైలిపై ప్రస్తుత కలెక్టర్ షణ్మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ ఆయన కార్యాలయంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారితో గంటకు పైగా సమావేశం అయ్యారు. 2020 డిసెంబర్‌లో జరిగిన నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి కలెక్టర్‌కు సమర్పించిన నోట్‌ఫైల్‌పై ఏడీ, సీనియర్ అసిస్టెంట్ల సంతకాలు లేకుండా కేవలం మేనేజర్ సంతకం మాత్రమే ఉండడం కలెక్టర్‌నే నిర్ఘాంతపోయేలా చేసింది. కోవిడ్ వేళ అప్పటి కలెక్టర్ సహా ఇతర అధికారులకు తీరిక లేని సమయాన్ని నరసింగరావు తనకు అనుకూలంగా మలుచుకున్నాడని విచారణలో నిర్థారణ అయింది. దీని ద్వారానే తాను లంచాలు తీసుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేసి, నిజమైన అర్హులకు అన్యాయం చేశాడని ప్రాథమికంగా తేల్చారు.
విచారణ కమిటీ సంధించిన 20 ప్రశ్నలకు ఒక్క రోజులో బదులు ఇవ్వాల్సిన ఉండగా, రెండు వారాల సుదీర్ఘ విరామం తర్వాత నరసింగరావు మంగళవారం తన సమాధానాలు అందించాడు. జీజీహెచ్ మేనేజర్ నరసింగరావుపై అందిన ఫిర్యాదు, చేపడుతున్న విచారణను ఈ సందర్భంగా విచారణ కమిటీ నిర్థారించింది. ఈ మేరకు మంగళవారం ఆసుపత్రి అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. విచారణ కొనసాగుతోందనీ, తమ నివేదిక ఆధారంగా సూపరింటెండెంట్ తదుపరి చర్యల కోసం కలెక్టర్‌కు నివేదిస్తామని కమిటీ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment