ఫ్రీమియంకు మంగళం | - | Sakshi
Sakshi News home page

ఫ్రీమియంకు మంగళం

Published Thu, Nov 14 2024 9:13 AM | Last Updated on Thu, Nov 14 2024 9:13 AM

ఫ్రీమ

ఫ్రీమియంకు మంగళం

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిహారం అందించడంలో ‘ఉచిత పంటల బీమా’ కీలక భూమిక పోషిస్తుంది. బీమా చేయించుకున్న రైతులకు పరిహారం అందుతుంది. పంటల సాగుకోసం బ్యాంకు, సొసైటీల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు సంబంధిత సంస్థలే బీమా సొమ్ము చెల్లిస్తాయి. బీమా పొందాలంటే రైతువాటాగా నిర్ధారించిన ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంది. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న ‘ఉచిత పంటల బీమా’కు కూటమి ప్రభుత్వం మంగళం పాడే దిశగా అడుగులు వేసింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలన్న నిబంధన తెర పైకి తెచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. బీమా ప్రీమియం సొమ్ము భారాన్ని రైతులపై మోపింది. ఈ పరిణామం రైతుల్లో ఆవేదన నింపుతోంది. అప్పులు చేసి పంటలు సాగు చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం తమకు ఏ మాత్రం ప్రోత్సాహం అందించడం లేదని ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో ఇలా..

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో సుమారు 83,068 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఇందులో అత్యధికంగా వరి 77,817 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416 హెక్టార్లలో సాగవుతాయి. పంట బీమా వర్తించాలంటే ప్రతి రైతు ప్రీమియం చెల్లించాల్సిందే. సహకార బ్యాంకులతో పాటు వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతుల నుంచి ఆయా బ్యాంకులే బీమా ప్రీమియంను రైతుకు ఇచ్చే రుణం నుంచి మినహాయించుకుంటాయి. రుణాలు తీసుకోని రైతులకు పంటల బీమా వర్తించాలంటే ముందుగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రీమియం చెల్లింపులు ఇలా..

2024–25 రబీ సీజన్‌కు ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం చెల్లింపునకు ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. ఇందులో భాగంగా జిల్లాలో వరి, మినుములు, పెసలు, జీడిపప్పు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. హెక్టారు వరి పంట విలువ రూ.1.05 లక్షలుగా నిర్ధారించి రైతు వాటాగా 1.5 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం డిసెంబర్‌ 31లోపు చెల్లించాలి. హెక్టారు మినుములు, పెసలు విలువ రూ.50 వేలు కట్టి 1.5 శాతం వంతున రూ.750 ప్రీమియం డిసెంబరు 15 నాటికి చెల్లించాలని నిబంధనలు విధించింది. హెక్టారు జీడితోటకు రూ.75 వేలుగా నిర్ధారించి ఇందుకు 5 శాతం వంతున అంటే రూ.3,750 ప్రీమియం నవంబర్‌ 15లోపు చెల్లించాలని పేర్కొంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇందులో ఏ పంటకూ ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే పంటల బీమా అమలు చేసింది.

రైతులపై భారం

కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీమా ప్రీమియం భారం రైతులపై పడనుంది. వచ్చే రబీ సీజన్‌ నుంచి పంట సాగుచేసే ప్రతి రైతు పంటల బీమా పొందాలంటే ప్రీమియం చెల్లించాల్సిందే. గత ఐదేళ్ల వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా చెల్లించని రైతులు ఇప్పుడు ప్రీమియం చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల సాగుకు ఇప్పటికే పెట్టుబడులు అందక అప్పులు చేసి వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో బీమా భారం తమపై మోపడం ఏంటన్న ప్రశ్న కర్షకుల్లో ఉత్పన్నమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని నిట్టూరుస్తున్నారు. ఇప్పటికే రైతుభరోసా పథకంలో ఏటా అందే పెట్టుబడి సాయం రూ.13,500 అందకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో ప్రీమియం చెల్లించడం కష్టంగా ఉందని ఆవేదన చెందుతున్నారు.

రూ.14.80 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ

మిచాంగ్‌ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,615 మంది రైతులకు సంబంధించి 10,487.02 హెక్టార్లలో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు అప్పట్లో వ్యవసాయ అధికారులు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం మరో ఆలోచన చేయకుండా రైతులకు అండగా నిలిచింది. నష్టపోయిన పంటలకు సాయంగా రూ.14.80 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేసింది.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా..

వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆదుకునే దిశగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2019 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను అమలు చేశారు. రైతులు సాగు చేసే మొత్తం విస్తీర్ణానికి చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే కట్టేలా చర్యలు తీసుకున్నారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా పథకం వర్తించడంతో పంటలకు నష్టం వాటిల్లిన ప్రతి సందర్భంలోనూ రైతులు పూర్తిగా నష్టపరిహారం అందుకునే వారు. కౌలు రైతులకు సైతం పరిహారం అందించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాలకే జమ చేసేవారు.

ఉచిత పంటల బీమాను అటకెక్కించే

దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు?

ప్రీమియం రైతులే చెల్లించేలా ఉత్తర్వులు

బడ్జెట్‌లో స్పష్టత ఇచ్చిన సర్కారు

అన్నదాతపై అదనపు భారం

డిసెంబరులోగా చెల్లించాలని గడువు

జిల్లావ్యాప్తంగా

1.65 లక్షల మంది రైతులు

ఏటా ఖరీఫ్‌, రబీలో 87,500 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు

క్రమం తప్పకుండా ప్రీమియం కట్టిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ

పంట వర్తింప చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ (హెక్టారుకు)

వరి, వేరుశనగ, పత్తి, చెరకు రూ.17,000

మొక్కజొన్న 12,500

మినుములు, పెసలు, శనగలు,

ప్రొద్దుతిరుగుడు, పొగాకు 10,000

జొన్న 8,500

రైతులే చెల్లించాలి

ఉచిత పంటల బీమా పొందాలంటే ప్రీమియం రైతులే చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ప్రక్రియ రైతులకు అలవాటైతే క్రమం తప్పకుండా చెల్లిస్తారు. తద్వారా ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బతిన్నా పరిహారం పొందే వీలుంటుంది. నిర్దేశించిన గడవులోగా ప్రతి రైతూ ప్రీమియం చెల్లించాలి.

– ఎస్‌.మాధవరావు,

జిల్లా వ్యవసాయ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
ఫ్రీమియంకు మంగళం 1
1/2

ఫ్రీమియంకు మంగళం

ఫ్రీమియంకు మంగళం 2
2/2

ఫ్రీమియంకు మంగళం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement