యువకుల మృతి దురదృష్టకరం
మృతుల కుటుంబీకులను పరామర్శించిన ఏపీ, తెలంగాణ గౌడ సంఘం నాయకులు
ఉండ్రాజవరం: విద్యుదాఘాతంతో యువకులు మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ, తెలంగాణ గౌడ సంఘం నాయకులు అన్నారు. మండలంలో తాడిపర్రు గ్రామంలో ఇటీవల సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతంతో మరణించిన వారి కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల గౌడ సంఘం నాయకులు బుధవారం తాడిపర్రులో సంతాప సభ ఏర్పాటు చేసి మృతులకు నివాళులు అర్పించారు. తొలుత సర్ధార్ పాపన్న గౌడ విగ్రహానికి పూలమాలలు వేశారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన యువకులు బోల్లా వీర్రాజు, మారిశెట్టి మణికంఠ, పామర్తి నాగేంద్ర, కాసగాని కృష్ణల కుటుంబాలకు వివిధ ప్రాంతాల గౌడ సంఘాల నుంచి సేకరించిన విరాళాలను ఒక్కొక్కరికి రూ.2.75 లక్షల చొప్పున రూ.11 లక్షలతో పాటు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావుకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఏపీ, తెలంగాణ గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు మోర్ల ఏడుకొండలు, గౌడ్ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాతా కృష్ణారావు, రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టా వీరబాబు గౌడ్, తాడిపర్రు ఎంపీటీసీ సభ్యుడు కట్టా వెంకటేశ్వరరావు, మారిశెట్టి సూరిపండు, మారిశెట్టి చిన్నయ్య, వేముల సత్యనారాయణ, వెలిగట్ల వీరవెంకట రాజు, గౌడ సంఘం పెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment