ముంబయి, ఢిల్లీకి ఎయిర్‌బస్‌లు
మధురపూడి: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబయి, ఢిల్లీకి విమాన సేవలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎస్.జ్ఞానేశ్వరరావు గురువారం ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ ఒకటో తేదీన 6ఇ 582 విమాన సర్వీసు ముంబయి నుంచి 16–50 గంటలకు బయలుదేరి, రాజమహేంద్రవరం విమానాశ్రయానికి 18–45 గంటలకు చేరుతుందన్నారు. 6ఇ 583 విమాన సర్వీసు రాత్రి 19–15 గంటలకు రాజమహేంద్రవరం నుంచి ముంబయికి బయలుదేరి 21–05 గంటలకు చేరుతుందన్నారు. డిసెంబర్ 12 తేదీన 6ఇ364 విమాన సర్వీసు ఢిల్లీ నుంచి 7–30 గంటలకు బయలుదేరి, 9–45 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుందన్నారు. ఇక్కడి నుంచి 6ఇ363 సర్వీసు 10–30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ చేరుతుందన్నారు. ఈ ఎయిర్‌బస్సుల్లో 180 సీట్లుంటాయని, వీటిలో రాజమహేంద్రవరం నుంచి 360 మంది ప్రయాణించడానికి అవకాశం ఉందన్నారు.
పిల్లలు బడిలోనే ఉండాలి
జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహంతుల్లా
ఐ.పోలవరం: బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, వారిని పనులకు వినియోగించకూడదని ముమ్మిడివరం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహ్మతుల్లా చెప్పారు. ముమ్మిడివరం జెడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ చిల్డ్రన్స్ అంటే భారతదేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినంగా పురస్కరించుకుంటామన్నారు. 14 ఏళ్లు లోపు చిన్నారులు నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలోనే ఉండాలన్నారు. చిన్నారులు ఫ్యాక్టరీల్లో, కిరాణా షాపుల్లో, మరే ఏ ఇతర ఇతర సంస్థల్లో గాని పని చేస్తే చట్టరీత్యా నేరమన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి సత్యనారాయణ, ముమ్మిడివరం ఎస్సై, జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రోబోటిక్ అప్లికేషన్‌పై
వర్క్‌షాపు
బాలాజీచెరువు: జేఎన్‌టీయూకేలో ఐఐఐపీటీ డైరెక్టర్ బీ.టీ.కృష్ణ ఆధ్వర్యంలో రోబోటిక్ అప్లికేషన్ కస్టమ్ ఎంబెడెడ్ బోర్డ్‌ను అభివృద్ధి చేయడంపై మూడు రోజులపాటు నిర్వహించే ఉచిత వర్క్‌షాపు గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఇన్‌చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రపంచలో ఆదరణలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డైటాసైన్స్ వంటి కోర్సులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రపంచ సాంకేతికరంగంలో భారతదేశం ముందంజలో ఉందని, రోబోటిక్, ఐటోటీ తదితర డిమాండ్ కోర్సులు అభ్యసించి నిష్ణాతులుగా రూపొందాలన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం మాజీ వీసీ, ఈసీఈ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ ఇండస్ట్రీ 4.0 దృష్టిలో ఉంచుకుని ఎంటెక్ రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రారంభించాలని యూనివర్సిటీ అధికారులను కోరారు. శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న జీకర్స్ ఎంప్లాయిమెంట్ ప్రతినిధులను అభినందించారు. రిసోర్స్ పర్సన్‌లు రాజా,భువనేశ్వరి రోబోటిక్ అప్లికేషన్ అభివృద్ది చేయడం, ఎంబెడెడ్ బోర్డుల రూపకల్పన పద్ధతులు వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.దుర్గాగంగారావుతో పాటు వర్సిటీ అనుబంధ ప్రైవేట్ కళాశాలల నుంచి 50మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజల ఆశలపై
నీళ్లు చల్లిన బడ్జెట్
పిఠాపురం: సూపర్ సిక్స్ పథకాలు అందుతాయని అవన్నీ బడ్జెట్‌లో ప్రజలకు అందించడానికి నిధులు కేటాయిస్తారని ఎదురు చూసిన ప్రజల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ నీళ్లు చల్లిందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్‌చార్జ్ వంగా గీత అన్నారు. ఆమె గురువారం పిఠాపురంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. కాని వారి ఆశలను అడియాశలు చేస్తూ ప్రజలకు ఏవిధంగాను ఉపయోగపడని బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని ఆమె విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసుల బనాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment