లక్ష్య సాధనకు యత్నించాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ప్రయత్నం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. గురువారం రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల దినోత్సవంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ప్రకాష్‌బాబు ముఖ్యఅతిథులుగా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసి నేడు ఉన్నతమైన స్థానానికి చేరుకున్నానన్నారు. ప్రతి ఒక్కరూ వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలను ఓర్చి స్కూళ్ళకు పంపుతారని, ఉపాధ్యాయుల, తల్లి తండ్రుల పేరు నిలిపేలా ఇష్టంతో కూడి కష్టపడి విద్యను అభ్యసించాలన్నారు. విద్యతో పాటు క్రీడకూ ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి భవిష్యత్తు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. క్రమశిక్షణ కలిగి మంచి విషయాలకు దగ్గరగాను, చెడు అంశాలకు దూరంగాను ఉండే విధంగా ప్రవర్తనను అలవర్చుకోవాలని ఆమె హితవు పలికారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల వేషధారణలు ఆలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment