ధవళేశ్వరం: సోషల్ మీడియా యాక్టివిస్ట్ మునగాల హరీశ్వరరెడ్డిని ధవళేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్ళపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డి టీడీపీ నేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని ఇటీవల తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టు రిమాండ్ విధించడంతో తిరుపతి సబ్‌జైల్‌కు తరలించారు. సోషల్ మీడియాలో హరీశ్వరరెడ్డి పెట్టిన పోస్టులపై తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తలారి మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం తిరుపతి వెళ్లిన ధవళేశ్వరం పోలీసులు పీటీ వారెంట్‌తో హరీశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని మూడో అదనపు జూనియర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించినట్టు ధవళేశ్వరం పోలీసులు తెలిపారు. డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సీఐ టి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment