108 కిలోల విబూదితో శివయ్యకు అభిషేకం
గండేపల్లి: మండలంలోని ఉప్పలపాడులో ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం 108 కిలోల విబూదితో స్వామి వారిని అభిషేకించారు. ఆలయ పురోహితులు చంద్రమౌళి సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
శతాధిక వృద్ధుడి మృతి
జగ్గంపేట: స్వాతంత్య్రోద్యమం నుంచి కూడా రాజకీయాలలో తిరుగుతూ ప్రముఖ నేతల వెంట నడిచిన శతాధిక వృద్ధుడు బూరా చిన అప్పారావు సోమవారం రాత్రి మృతి చెందారు. జగ్గంపేట అంబేద్కర్ నగర్‌కు చెందిన అప్పారావు 1907లో జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసుత్తం అప్పారావుకు 116 సంవత్సరాలు అని కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో కూతురు బి.సరోజిని వద్ద ఇంటి వద్ద ఉంటున్నారని వారు తెలిపారు. ఆయన మృతికి స్థానిక నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.
25 వరకూ
దూర విద్య అడ్మిషన్లు
నల్లజర్ల: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈనెల 25 వరకూ టెన్త్, ఇంటర్‌లకు తత్కాల్ అడ్మిషన్లు చేసుకోవచ్చని దూబచర్ల స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్ అంబటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయాన్ని ఆసక్తిగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇంటర్ పరీక్షల ఫీజుకు
రేపే తుది గడువు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఈ నెల 21వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో ఎన్‌ఎస్‌ఎల్‌వీ నరసింహం మంగళవారం తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో జనరల్, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు ఆ గడువులోగా చెల్లించాలన్నారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో 22 నుంచి డిసెంబర్ ఐదో తేదీలోగా చెల్లించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment