పిండినల్లి వల్లే పంటకు నష్టం
ప్రిన్సిపల్ సైంటిస్ట్ సుధారాణి
పిఠాపురం: పిండినల్లి ఆశించడం వల్లే పత్తి పంటకు నష్టం వాటిల్లుతోందని, రైతులు జాగ్రత్తలు పాటించి నష్టాలు నివారించుకోవచ్చని ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎస్.సుధారాణి సూచించారు. మంగళవారం గొల్లప్రోలు మండలం దుర్గాడ రైతు సేవ కేంద్రంలో పెద్దాపురం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శర్మ, పిఠాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు పి.స్వాతి తదితరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పలు సూచనలు ఇచ్చారు. దుర్గాడలో వేసిన పత్తి పంటకు పిండి నల్లి ఆశించిందని, దీని నివారణకు ఎసిఫేట్ రెండు గ్రాములు ఒక లీటరు నీటిలో గాని, ట్రోఫీకోనజోల్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని సర్ఫ్ గాని టీ పాలు గాని స్ప్రేయర్ కి 50 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పంట నుంచి తీసిన పత్తిని దుకాణదారులు రూ.50 నుంచి రూ.55కు మాత్రమే కొంటున్నందున నష్టపోతున్నారని, వ్యవసాయ మార్కెట్ కమిటీ పిఠాపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో రూ.71 నుంచి రూ.75 వరకు విక్రయించవచ్చునని, దీనిపై రైతులు అవగాహన పెంచుకోవాలని వారు వివరించారు. పెద్దాపురం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శర్మ మాట్లాడుతూ మినుములు, నువ్వు పంటపై చేయవలసిన సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, రైతులు, ఎంఏఓ కేవీవీ సత్యనారాయణ, రైతు సేవా కేంద్రం సిబ్బంది కె.పద్మిని, ఎస్.దుర్గా దేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment