గండేపల్లి: జాతీయ రహదారి పక్కన నిర్లక్ష్యంగా నిలిపిన లారీని ఢీకొని టూ వీలర్‌పై వెళ్తున్న దంపతుల్లో భర్త మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై యూవీ శివనాగబాబు తెలిపిన వివరాల మేరకు కిర్లంపూడి మండలం సోమవరం గ్రామానికి చెందిన చల్ల వెంకటరమణ, భార్య లక్ష్మి మోటార్ సైకిల్‌పై రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తున్నారు. మండలంలోని మురారి శివారు దాబా వద్దకు వచ్చే సరికి రోడ్డు పక్కన నిలిపిన లారీని వెనక నుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమైన వెంకటరమణ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి : ఇద్దరికి గాయాలు
ముమ్మిడివరం: మండలం నడిమిలంక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గొల్లల మామిడాడకు చెందిన కోత మెషీన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న యు. అనుకుమార్, యు.అభిషేక్, ఎ.సురేష్ మచిలీపట్నం నుంచి మంగళవారం తెల్లవారుజామున గొల్లలమామిడాడ వెళ్తుండగా మోటార్ సైకిల్ అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనుకుమార్ (23) అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అభిషేక్, సురేష్ ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఎస్‌ఐ జి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కల దాడితో లేగదూడ మృతి
సామర్లకోట: కుక్కల దాడితో ఒక లేగదూడ మృతి చెందింది. స్థానిక లారీ యూనియన్ కార్యాలయం వద్ద పశువుల మకాంలో ఉన్న సుమారు ఆరు రోజుల లేగదూడపై సోమవారం రాత్రి సుమారు పది కుక్కల వరకు దాడి చేశాయని రైతు పుట్టా వీర్రాజు తెలిపాడు. తాను కర్రతో ఎంత బెదిరించినా వదలకుండా లేగదూడను తీవ్రంగా గాయపరచడంతో అది మృతి చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు నెల రోజల క్రితం 8 రోజుల లేగదూడపై దాడి చేసి చంపేశాయని, కుక్కలు గుంపులు, గుంపులుగా రావడంతో జనం రోడ్లపై ఒంటిరిగా రాత్రి సమయంలో తిరగడానికి బయపడుతున్నారన్నారు. రెండు రోజుల క్రితం విధులకు వెళ్తున్న దేవదాయశాఖ ఉద్యోగి కుక్కకాటుకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment