వంగలపూడి ఓపెన్ రీచ్ మూసివేత
సీతానగరం: ఇసుక విక్రయాల్లో అధిక ధర వసూళ్లు, నిర్వహణ సరిగా లేకపోవడంతో వంగలపూడి ఓపెన్ రీచ్ మూసివేసినట్టు జేసీ చినరాముడు తెలిపారు. బుధవారం ర్యాంపులో నెలకొన్న వివాదంతో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. టన్ను రూ.70.19 వసూళ్లు చేయాల్సి ఉండగా రూ.270 నుంచి రూ. 300 వరకు వసూలు చేయడంతో ర్యాంపు నిర్వాహకులు, లారీ యజమానుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. లారీలపై ఇసుక ఎగుమతులు నిలిపివేయాలని లారీలను అడ్డుగా పెట్టడంతో స్టాక్ పాయింట్ వద్ద ఇసుక ఎగుమతులు నిలిచాయి. ఈ సమాచారం అందుకున్న జేసీ చిన రాముడు ర్యాంపు వద్దకు చేరుకుని ఇరు వర్గాలతో చర్చించారు. అధిక రేట్లకు ఇసుక విక్రయిస్తున్నారని జేసీకి ఫిర్యాదు అందడంతో ఆయన తక్షణమే వంగలపూడి ఓపెన్ రీచ్ 1, 2 లను మూసివేయాలని ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన పాన్ ఇండియా ప్రాజెక్టుకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలో మరో ఏజెన్సీ గుర్తించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఇసుకను ట్రాక్టర్లు, ఎండ్ల బడ్లపై ఉచితంగా తీసుకువెళ్లవచ్చునని ఆయన తెలిపారు. స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఇసుకను లారీలపై ఎగుమతి చేస్తారని, ఆన్‌లైన్‌లో చెల్లించిన నగదు తిరిగి బుక్ చేసిన వారికి అందజేస్తారని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్.కృష్ణ నాయక్, తహసీల్దార్ ఎ.శ్రీనివాస్, ఇతర అధికారులు, బోట్స్‌మన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
అధిక ధరలకు ఇసుక విక్రయంపై
జేసీ చినరాముడు ఆదేశం
నిలచిన ఇసుక ఎగుమతులు
Comments
Please login to add a commentAdd a comment