అధినేతతో భేటీ
కొవ్వూరు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఇటీవల రాజకీయ పరిణామాలను, పార్టీ పరిస్థితిని వివరించినట్లు వెంకట్రావు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం మరింత సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారన్నారు. ఈ సందర్భంగా తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోశిబాబు వైఎస్సార్ సీపీలో చేరారు. కార్యక్రమంలో చాగల్లు ఎంపీపీ మట్టా వీరస్వామి, యాళ్ల బాబూరావు, పిట్టా శ్రీనివాసు, సిర్రా గంగారామ్, కోయ దుర్గారావు, గండి రాంబాబు, పలువురు నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా
ఎమ్మెల్సీ ఎన్నికలు
సిబ్బందికి శిక్షణలో కలెక్టర్ ప్రశాంతి
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో మార్గదర్శకాల, శిక్షణ సామగ్రిపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏఆర్వో, సహాయ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్ రోజు విధులపై ఇచ్చిన శిక్షణకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ ప్రశాంతి, డీఆర్వో టి.సీతారామమూర్తి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది విధులపై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక సాగనుందని, ఫారం 16 ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. బ్యాలెట్ బాక్సు, బ్యాలెట్ పేపర్, పేపర్ సీల్, మెటల్ సీల్, రబ్బర్ స్టాంప్, ఫారం 14, 15, 16పై అవగాహన కల్పించినట్టు ఆమె తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ఆర్డీవో ఆర్.కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పీఎఫ్ బకాయి
వసూళ్లకు చర్యలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉద్యోగి భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో నవంబరు 2024 నుంచి జనవరి 2025 వరకు ప్రత్యేక వసూళ్లకు చర్యలు చేపట్టినట్టు ఈపీఎఫ్‌ఓ రికవరీ ఆఫీసర్ వైడీ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ పరిధిలోని సంస్థల నుంచి ఈపీఎఫ్ బకాయిల వసూళ్లు లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఆయా సంస్థలు స్వచ్ఛందంగా నిధులు చెల్లించేలా వారితో సంప్రదించడం జరుగుతుందన్నారు.
పొగాకు సాగులో మల్చింగ్
దేవరపల్లి: కూలీల కొరత, కలుపు సమస్యతో ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులు కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు మల్చింగ్ షీట్ వినియోగించి పొగాకు నాట్లు వేస్తున్నారు. షీట్‌పై రంధ్రాలు పెట్టి వాటిలో మొక్క నాటుతున్నారు. దీనితో పాటు డ్రిప్ ఏర్పాటు చేసి నాట్లకు నీరు పెడుతున్నారు. ఈ విధానం వల్ల పొలంలో కలుపు రాదని, అలాగే నీరు సైతం వృథా కాదని రైతులు చెప్తున్నారు. ఎకరాకు రూ.12 వేలు మల్చింగ్ షీట్, రూ.10 వేలు డ్రిప్, కూలీలకు రూ. 3 వేలు ఖర్చు అవుతుందని రైతులు చెప్పారు. దీనివల్ల పొగాకు నాణ్యత బాగుంటుందని రైతులు తెలిపారు. ఎకరాకు అన్ని ఖర్చులు కలిపి సుమారు రూ.25 వేలు అవుతుందని రైతులు చెప్పారు. 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు డ్రిప్ సరఫరా చేస్తున్నట్టు రైతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment