తప్పిపోయిన మహిళ బంధువుల చెంతకు
అన్నవరం: బంధు మిత్రులతో కలసి తీర్థయాత్రలు చేస్తూ అన్నవరం రైల్వే స్టేషన్లో దిగి తప్పిపోయి రెండ్రోజులుగా ఇబ్బంది పడుతున్న ఖర్నూల్ జిల్లా రాయచూర్‌కు చెందిన గుర్రం లక్ష్మీదేవిని బంధువులకు అప్పగించినట్లు అన్నవరం రైల్వై స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రాయచూర్‌కు చెందిన గుర్రం లక్ష్మీదేవి తన బంధువులు, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తూ సోమవారం అన్నవరం రైల్వే స్టేషన్లో దిగిపోయింది. ఆమె తన బంధు మిత్రులను కలుసుకునేందుకు రెండ్రోజులుగా ప్రయత్నిస్తుంది. అయితే ఆమె బంధువులు సామర్లకోట, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఆమె కోసం గాలిస్తున్నారు. కాగా, బుధవారం అన్నవరం రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు ధరించి లగేజీ బ్యాగ్‌తో తిరుగుతున్న ఆమెను రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు విచారించగా తన వివరాలు తెలిపింది. దీంతో తుని రైల్వే ఎస్ఐ జి.శ్రీనివాస్‌కు విషయం తెలియజేయగా ఆయన సూచనలు మేరకు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. బుధవారం బంధువులు అన్నవరం రైల్వే స్టేషన్‌కు రాగా గుర్రం లక్ష్మీదేవిని వారికి అప్పగించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment