స్థూల మూల వేతనం ఇవ్వరూ..
కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల వేడుకోలు
రాజమహేంద్రవరం: తమను ఆదుకోవాలని కోరుతూ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులు ఖాళీ ప్లేట్లతో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నూరు శాతం జీతం జీఓ అమలు చేసి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రానికి రీ ఒరియంటేషన్‌కు వచ్చిన ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జీవీవీ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత ఉన్నా ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ కాలేకపోయారన్నారు. తమ బతుకులకు భరోసా లేక పోయినా కనీసం ఉన్నంతలో సంతృప్తికర నూరు శాతం వేతనం అందించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ జీఓ అమలుకు అవసరమైతే మూకుమ్మడిగా అమరావతికి వెళ్లాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. పదవీ విరమణ వయసు విషయంలోనూ తమకు తీరని అన్యాయం జరుగుతోందని, అందరికీ 62 ఏళ్లకు పదవీ విరమణ అయితే, తాము 60 ఏళ్లకే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తోందన్నారు. తమకూ 62 ఏళ్ల రిటైర్మెంట్ అవకాశం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment