సంక్షోభ గృహాలు
హైకోర్టు మార్గదర్శకాలు ఇలా..
సంక్షేమ వసతి గృహాల్లో ఉండాల్సిన వసతులపై ఇటీవల హైకోర్టు మార్గదర్శకాలు వెలువరించింది. వాటిని పరిశీలిస్తే..
● వసతి గృహం భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్‌తో ప్రహారీ నిర్మించాలి. గేటు తప్పనిసరిగా ఉండాలి.
● విద్యార్థుల రాకపోకలు ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి.
● హాస్టల్ ప్రవేశ మార్గం, కామన్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
● మురగుదొడ్లు శుభ్రంగా ఉండాలి. నీటి సదుపాయం కల్పించాలి.
● హాస్టల్లో పనిచేసే సిబ్బందికి ప్రవర్తనా నియమావళి నిర్దేశించాలి. విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి.
● జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా హాస్టళ్లు ఉండాలి. ఇలా అనేక మార్గదర్శకాలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్క వసతి గృహంలోనూ ఈ మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్న దాఖలాలు లేవు.
సాక్షి, రాజమహేంద్రవరం: శిథిల భవనాలు.. అపరిశుభ్రతతో కూడిన మరుగుదొడ్లు.. చాలీచాలని గదులు.. దోమలతో సహజీవనం.. భోజనశాలలు లేని దుస్థితి.. మౌలిక వసతులు కరువు.. ఆపై కాస్మెటిక్ చార్జీల విడుదలతో జాప్యం.. ఇలా ఎన్నో సమస్యలు సంక్షేమ, వసతి గృహాల్లో రాజ్యమేలుతున్నాయి. పేద విద్యార్థుల సంక్షేమం, వసతితో కూడిన విద్య అందించేందుకు నెలకొల్పిన గృహాలు నిర్వహణ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. పర్యవేక్షణ కొరవడడంతో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టిక ఆహారం కరువైపోయింది. సీసీ కెమెరాలు, ప్రహరీ గోడలకు విద్యుత్ ఫెన్సింగ్ లేకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితులపై హైకోర్టు తీవ్ర ఆందోళన, తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన చెందింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై సమగ్రంగా దృష్టి సారించాలని అభిప్రాయపడింది. విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా విద్య, వసతి పొందేలా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేసింది. జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో వసతి గృహాల్లో అనేక సమస్యలు తేటతెల్లమయ్యాయి. వాటి వివరాలు ఇలా..
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా 36 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా.. 2,600 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఆరు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 24 బీసీ సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. 1,657 మంది విద్యార్థులు వీటిలో వసతి పొందుతున్నారు. ఒకటి గురుకుల పాఠశాల ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల, కేజీబీవీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వసతి గృహాల నిర్వహణ, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించడంతో రోగాల బారిన పడిన సందర్భాలు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో నిర్వహణ బడ్జెట్‌ను విడదల చేయకపోవడంతో బ్లీచింగ్, ఇతర వస్తువుల కొనుగోలు చేసేందుకు ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు చేతి చమురు వదిలించుకుంటున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మెటిక్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యార్థులకు అత్యవసరమైన సబ్బులు, టూత్ పేస్టులు, కొబ్బరినూనె కొనుగోలు చేయడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.
హాస్టళ్ల పరిశీలన ఇలా..
● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరంలోని సమీకృత బాలుర వసతి గృహంలో 65 మంది విద్యార్థులున్నారు. ఈ వసతి గృహం కిటికీలకు తలుపులు లేవు. దోమ తెరలు సైతం లేవు. వెరసి విద్యార్థులపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
● కడియం బాలుర వసతి గృహంలో 27 మంది విద్యార్థులున్నారు. అవసరమైన మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న వాటికి సరైన నిర్వహణ లేక అపరిశుభ్రంగా ఉన్నాయి. అదనపు మరుగుదొడ్లకు ప్రతిపాదనలు పంపించినా అనుమతులు వచ్చిన దాఖలాలు లేవు. దోమల దండయాత్రలతో విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు.
● నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో కానూరు ఎస్సీ బాలుర వసతి గృహంలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం బాలుర వసతి గృహంలో 22 మంది విద్యార్థులున్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేవు. ప్రధాన ద్వారం వద్ద చెత్త వేయడంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. విద్యార్థులకు అవసరమైన నీటి వసతి లేదు. కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలికి వణకాల్సిన దుస్థితి తలెత్తుతోంది. భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
● జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం నగరంలో వసతి గృహాల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బాలుర సంక్షేమ వసతి గృహంలో 98 మంది విద్యార్థులున్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో చలికాలంలో స్నానాలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు.
● గోపాలపురం బీసీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది. అదే భవనంలో 20 మంది విద్యార్థులు విద్య, వసతి పొందుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే భయమేస్తోందని వాపోతున్నారు. ఉదయం, సాయంత్రం జాతీయ రహదారిపై నడుస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన చెందుతున్నారు. భవనాన్ని మార్చి హైస్కూల్‌కు సమీపంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
● నిడదవోలు రూరల్ సమిశ్రగూడెం ఎస్సీ బాలికల వసతి గృహంలో 36 మంది విద్యార్థినులు ఉన్నారు. భవనం సుమారు 35 ఏళ్ల క్రితం నిర్మించారు. నూతన భవన నిర్మాణానికి మూడు కోట్లతో ప్రతిపాదనలు పంపారు. 2021లో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రూ.35 లక్షలు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. హాస్టల్లో కిటికీ మెష్‌లకు రంధ్రాలు పడ్డాయి. కొన్ని ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదు. బాత్‌రూమ్ శిథిలావస్థకు చేరడంతో బాలికలు ఇబ్బంది పడుతున్నారు. ప్యూరిఫైడ్ వాటర్ సిస్టం పనిచేయడం లేదు. భోజనశాల శ్లాబ్ లీక్ కావడంతో నీరు చేరుతోంది. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో స్నానాలు చేసేందుకు అవస్థలు తప్పడం లేదు. వసతులు లేకపోవడంతో గతంలో 86 మంది ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 36కు చేరారు.
● కొవ్వూరు మండలం సాంఘిక సంక్షేమ బాలురు వసతి గృహం, బీసీ సంక్షేమ బాలుర హాస్టల్, బీసీ బాలుర కళాశాల వసతి గృహాలతో పాటు వాడపల్లిలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల అద్దె భవనాల్లో అరకొర వసతులతో నడుస్తున్నాయి. కొవ్వూరులో ఎస్సీ, బీసీ హాస్టళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో గత ఏడాది నుంచి అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు. నెల రోజుల క్రితమే ఎస్సీ బాలుర వసతి గృహం అద్దె భవనంలోకి మారింది. అద్దె భవనాల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో హాస్టల్‌లో 100 సామర్థ్యం ఉన్నప్పటికీ సౌకర్యాల లేమి, సొంత భవనాలు లేకపోవడం తదితర కారణాలతో సగం మంది కూడా చేరడం గగనంగా మారింది. అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ఫ శిథిల భవనాల్లోనే హాస్టళ్లు
ఫ అపరిశుభ్ర వాతావరణం, వసతుల
కొరతతో విద్యార్థుల ఇబ్బందులు
ఫ కానరాని సీసీ కెమెరాలు
ఫ జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలు కరవు
ఫ ఈ పరిస్థితులపై
ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment