నూతన పద్ధతులపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలి
ఆల్కాట్‌తోట (రాజహేంద్రవరం రూరల్): వాణిజ్య పంటల సాగులో జన్యుపరమైన నూతన పద్ధతులు, కొత్త రసాయనాలు, విలువ జోడింపుపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్‌ఐ) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ సూచించారు. బుధవారం స్థానిక సీటీఆర్‌ఐలోని సమావేశ మందిరంలో మూడో రోజు పరిశోధన కమిటీ సమావేశాలు ఆయన అధ్యక్షతన జరిగాయి. దీనికి డాక్టర్ ఎం.శేషుమాధవ్, బెంగళూరు ఐఐహెచ్‌ఆర్ ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సీకే నారాయణ, సీటీఆర్‌ఐ ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సీవీ నరసింహారావు, హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ బీబీ సుబ్బారెడ్డి, సీటీఆర్‌ఐ ఫార్మర్ డివిజన్ హెడ్ సి.చంద్రశేఖరరావు నిపుణులుగా వ్యవహరించారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు ఎల్‌కే ప్రసాద్, అనిందిత పాల్, కె.సుమన్ కళ్యాణి, ఎం.అనురాధ, నమితాదాస్ సాహా తమ పరిశోధనా ఫలితాలను వివరించారు. వాణిజ్య పంటల సాగులో కొత్త రసాయనాలు, విలువ జోడింపు పరిశోధనలపై చర్చించారు. ఆముధం నూనె నుంచి 2–ఆక్టనాల్ వెలికితీత, వర్జీనియా పొగాకులో పిలకలను అరికట్టడానికి కొత్త రసాయనాలు, అశ్వగంధలో బయో యాక్టివ్ కాంపౌండ్లు, పురుగు మందుల అవశేషాలను గుర్తించే విశేష పద్ధతులు వంటి పరిశోధనలపై పురోగతిని తెలిపారు. పసుపు, మిరపను ఉపయోగించి విలువ ఆధారిత ఉత్పత్తులు, వాటి ప్రయోజనాలు వివరించారు. అనంతరం సాంకేతిక సమావేశాలకు నిపుణులుగా హైదరాబాద్ ఐఐఆర్ ఫార్మర్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ఎం.సుజాత, సీటీఆర్‌ఐ ఫార్మర్ డైరెక్టర్ టీజీకే మూర్తి వ్యవహరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు కె.సరళ, సి.నంద, కె.గంగాధర్, పి.మణివేల్, జేజే రాజప్ప తమ పరిశోధనా ఫలితాలను తెలిపారు. వాణిజ్య పంటల్లో జన్యు మెరుగుదల, నూతన పద్ధతులు, వంగడాల్లో అధిక దిగుబడి, అధిక నాణ్యతను పెంపొందించడం, వ్యాధి నిరోధక వంగడాలపై జరుగుతున్న పరిశోధనల ఫలితాలను నిపుణులు చర్చించి సలహాలు, సూచనలను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment