బంగారం షాపు గుమస్తా చేతివాటం
నిడదవోలు: గోల్డ్ టెస్టింగ్ షాపులో ఏడాదిన్నరగా నమ్మకంగా పని చేస్తున్న ఓ గుమస్తా చేతివాటం ప్రదర్శించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. నిడదవోలులో సీఐ పీవీజీ తిలక్ బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర రాజ్యవేడి గ్రామానికి చెందిన బంగారు వ్యాపారులు ప్రశాంత్, నేతాజీలు 20 ఏళ్ల కిందట ఆంధ్రాకు వచ్చారు. ఇందులో వ్యాపారి ప్రశాంత్ రాజమహేంద్రవరంలో డీకే గోల్డ్ టెస్టింగ్ షాపు, మరో వ్యాపారి నేతాజీ తాడేపల్లిగూడెంలో జేపీ గోల్డ్ టెస్టింగ్ షాపులు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో డీకే గోల్డ్ టెస్టింగ్ బంగారు షాపులో అమర్ గుమస్తా ఏడాదిన్నరగా పని చేస్తున్నాడు. అయితే తాడేపల్లిగూడెం షాప్‌లో పనిచేస్తున్న సాగర్ అనే వ్యక్తి పనిచేయడం మానేయడంతో 15 రోజుల కిందట గుమస్తా అమర్‌ను తాడేపల్లిగూడెం షాపునకు పనికి పంపించారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన అమర్‌కు దురాశ కలిగింది. బంగారాన్ని కాజేసి ఎవరికి చెప్పకుండా మహారాష్ట్ర వెళ్లిపోయి తనకు ఉన్న అప్పులు తీర్చి జీవిద్దామని పధకం వేశాడు. తాడేపల్లిగూడెం షాపు యజమాని నేతాజీ ఈ నెల 13న రాత్రి రాజమహేంద్రవరం షాపునకు తీసుకు వెళ్లాలని సుమారు 289.340 గ్రాముల గోల్డ్ కచ్చా ముక్కలు, రూ. 6.30 లక్షల నగదును అమర్‌కు ఇచ్చాడు. వాటిని తీసుకుని ఈనెల 14న అతను మోటార్ సైకిల్‌పై బయలు దేరాడు. అమర్ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం నిడదవోలు పట్టణంలోని ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం వద్ద రోడ్డు పక్కన తుప్పల్లో బంగారం, నగదును దాచాడు. తర్వాత తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న తనను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అడ్డగించి కత్తి చూపించి బెదిరించి బంగారం, నగదు దోపిడీ చేశారని గుమప్తా అమర్ కట్టుకథ అల్లాడు. ఈ ఘటనపై తాడేపల్లిగూడెం షాపు యజమాని నేతాజీ నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. చివరకు బుధవారం అమర్‌ను అరెస్టు చేసి, మొత్తం సొత్తు రికవరీ చేశారు. పట్టణ ఎస్సై శోభన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment