కిక్కో..కిక్కు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విధానం పుణ్యమా అని పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ పడితే మద్యం షాపులు పెట్టడం.. వీటికి అనుబంధంగా బెల్టు షాపులు తిరిగి ప్రారంభం కావడంతో మందు బాబులకు అందుబాటులోనే మద్యం లభిస్తోంది. దీంతో వారు తెగ తాగేస్తున్నారు. వెరసి మద్యం వ్యాపారం ‘మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులు’ అన్న చందంగా సాగుతోంది. ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీ ప్రారంభించి 2 నెలలు కూడా పూర్తిగా గడవకముందే.. చాగల్లు, రాజమహేంద్రవరలోని ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) డిపోల పరిధిలో ఏకంగా రూ.245 కోట్ల విలువైన మద్యం, బీర్లను మద్యం షాపులకు, బార్లకు సరఫరా చేశారు. దీనినిబట్టి మద్యం వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలకు మేలు చేసేలా
గత ప్రభుత్వ విధానం
మద్యపాన ప్రియులను ఆ వ్యసనం నుంచి తప్పించి, వారి ఆరోగ్యాన్ని, కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగు చేసే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మద్యం పాలసీ రూపొందించి, అమలు చేసింది. ఇందులో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాలకు మంగళం పాడింది. వాటికి అనుబంధంగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను పూర్తిగా అరికట్టింది. షాపుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. వాటిని ప్రభుత్వమే నిర్వహించేది. అది కూడా నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం విక్రయించే వారు. మద్యం ధరలు పెంచడం ద్వారా మద్యపాన ప్రియులు ఈ వ్యసనానికి దూరమయ్యేలా చేసేందుకు ప్రయత్నించింది. తద్వారా సమాజానికి మేలు జరగాలని ఆకాంక్షించింది.
కూటమి హయాం.. ప్రైవేటు పరం..
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి పాలకులు నూతన మద్యం పాలసీ రూపొందించి, గత ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చారు. మద్యం వ్యాపారాన్ని తిరిగి ప్రైవేటుకు కట్టబెట్టారు. షాపుల సంఖ్యను విపరీతంగా పెంచేశారు. వాటిని దక్కించుకున్న కూటమి నేతలు మద్యం సిండికేట్ వ్యాపారానికి తెర తీశారు. గత నెల 16 నుంచి ప్రైవేటు షాపుల ద్వారా పూర్తి స్థాయిలో మద్యం విక్రయాలు ప్రారంభించారు. ఈ షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు రాజమహేంద్రవరం రూరల్, చాగల్లులో ఉన్న 2 ఐఎంఎల్ డిపోల నుంచి అవసరమైన సరకు సరఫరా చేస్తున్నారు.
అడ్డూ అదుపూ లేని విక్రయాలు
జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపులకు అబ్కారీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో సింహభాగం దక్కించుకున్న కూటమి నేతల నేతృత్వంలోని సిండికేట్ ధనార్జనే ధ్యేయంగా ఒక్కో దుకాణానికి అనుబంధంగా కనీసం 30కి పైగా బెల్టు షాపులు ఏర్పాటు చేసింది. ఎవరు ఎక్కడ పెట్టుకోవాలి, ఒక్కో బెల్టు షాపునకు ఎంత డిపాజిట్ చెల్లించాలి, అబ్కారీ శాఖకు ప్రతి నెలా ఎంత ముట్టజెప్పాలనే విషయాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరీ వ్యాపారులకు, బెల్టు దుకాణాల నిర్వాహకులకు దిశానిర్దేశం చేసింది. పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఇప్పటికే బెల్టు షాపులు ప్రారంభించేశారు. వైన్ షాపుల నుంచి గరిష్ట అమ్మకం ధర(ఎంఆర్‌పీ)కు కొనుగోలు చేస్తున్న బెల్టు వ్యాపారులు క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.30 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు.
అడ్డుకోని అబ్కారీ!
విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేయడమే కా కుండా.. వాటి ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా అబ్కారీ శాఖ అడ్డుకుంటున్న దాఖలా లు లేవు. కొందరు మద్యం షాపుల నిర్వాహకులు అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేసి, విక్రయా లు సాగిస్తున్నా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో పర్యటించి, దాడులు చేస్తున్న దాఖలాలు కానరావడం లేదు. మద్యం సిండికేట్ల ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తు న్నాయి. విచ్చలవిడి మద్యం విక్రయాలకు, బెల్టు షాపులకు అబ్కారీ అధికారులు వెంటనే కళ్లెం వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
విక్రయాల్లో నయా దందా!
డోర్ డెలివరీ ద్వారా మద్యపాన ప్రియులకు వారి చెంతనే మద్యం అందించే నయా దందాకు సిండికేట్ తెర తీసింది. ఫలానా రకం మద్యం కావాలని ఎవరైనా ఫోన్ చేస్తే చాలు.. వైన్ షాపుల యజమానులు వెంటనే బెల్టు షాపుల ద్వారా నిమిషాల వ్యవధిలోనే కోరుకున్న బ్రాండ్ మద్యం అందిస్తున్నారు. పండగలు, పుట్టిన రోజు, పెళ్లి రోజు తదితర ఫంక్షన్లకు ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. దీనికి గాను ఎంఆర్‌పీ కంటే ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ దందాను ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శ వస్తోంది.
చాగల్లులోని ఐఎంఎల్ డిపో
రెండు ఐఎంఎల్ డిపోల పరిధిలో
భారీగా అమ్మకాలు
2 నెలల్లోనే రూ.245 కోట్ల విక్రయాలు
మద్యం షాపులు, బార్లలో మద్యం ఏరులు
తోడవుతున్న బెల్ట్ షాపులు
Comments
Please login to add a commentAdd a comment