మత్స్యకారుల జీవనోపాధి పెంచడమే లక్ష్యం
ధవళేశ్వరం: మత్స్యకారుల జీవనోపాధి పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద ప్రపంచ మత్స్య దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్ 35 లక్షల చేప పిల్లలను గోదావరిలోకి వదిలారు. అనంతరం మాట్లాడుతూ, మత్స్యకారుల్లో సాంకేతికతతో కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచి, మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మత్స్య సంపదను పెంపొందించడంతో పాటు ఆక్వా పరిశ్రమలు, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆక్వా ఉత్పత్తుల పట్ల కొంత మంది విద్యార్థులకు మెళకువలు నేర్పాలన్నారు. విదేశాల్లో డ్రై ఫిష్‌కు చాలా డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించుకునే సోలార్ డ్రై దిశగా అవకాశాలను మెరుగుపరచుకోవాలన్నారు. అనంతరం మత్స్యకారులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. చేప పిల్లల ఉత్పత్తి, పెంపకంలో శిక్షణ పొందిన 75 మంది విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు, తహసీల్దార్ పీవీ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డీఎఫ్‌సీఎస్ ఎం.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
26న బాల్‌రంగ్ పోటీలు
రాజమహేంద్రవరం రూరల్: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన పాఠశాల విద్యార్థులకు బాల్‌రంగ్ పోటీలు నిర్వహించనున్నారు. బొమ్మూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఏఎం జయశ్రీ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇందిరాగాంధీ మానవ్ సంగ్రహాలయ, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించనున్నాయన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి జిల్లాకు ఒక టీమ్‌ను ఎంపిక చేస్తారన్నారు. జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 26న బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రాంగణంలో జరగనున్నాయని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు స్థానిక సంప్రదాయ జానపద నృత్యం, కళలు, తప్పెటగుళ్లు, కర్రసాము, చెంచుల వేట, థింసా, జాలరి, బంజారా తదితర కళలను ప్రదర్శించవచ్చని వివరించారు. ప్రదర్శన సమయం 10 నిమిషాలకు మించరాదన్నారు. గత ఏడాది బాల్‌రంగ్ పోటీల్లో పాల్గొన్న వారు ఈ ఏడాది పోటీల్లో పాల్గొనేందుకు అనర్హులని పేర్కొన్నారు. ప్రత్యక్ష సంగీత వాయిద్యం మాత్రమే అనుమతిస్తారని, క్యాసెట్లు, సీడీలు అనుమతించబోరని జయశ్రీ స్పష్టం చేశారు. టీమ్‌లో గరిష్టంగా 16 మంది విద్యార్థులు మాత్రమే పాల్గొనవచ్చన్నారు. వివరాలకు డైట్ అధ్యాపకుడు ఎం.రాజేష్‌ను 94906 48110 మొబైల్ నంబర్‌లో సంప్రదించాలని జయశ్రీ తెలిపారు.
నకిలీ విత్తనాలపై రైతుల రగడ
అన్నదేవరపేటలో కంపెనీ
ప్రతినిధులను నిర్బంధించిన వైనం
తాళ్లపూడి (కొవ్వూరు): నకిలీ వరి విత్తనాలతో మోసపోయిన అన్నదేవరపేట రైతులు కంపెనీ ప్రతినిధులను నిర్బంధించారు. నాసిరకం విత్తనాలు ఇచ్చి మోసం చేశారంటూ గురువారం క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంత వరకూ కదలనివ్వబోమని అన్నారు. అసలేం జరిగిందంటే.. కొద్ది రోజుల కిందటి నుంచి నకిలీ విత్తనాలపై తాళ్లపూడి వ్యాపారిని రైతులు నిలదీస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారి సూచనల మేరకు కంపెనీ ప్రతినిధులు గురువారం అన్నదేవరపేటకు వచ్చారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ, విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులు తీసుకు రావాలని సూచించారు. పలువురు కంపెనీ ప్రతినిధులకు బిల్లులు అందజేశారు. బిల్లుతో పాటు విత్తనాల సంచులను తీసుకు రావాలని మళ్లీ తెలపడంతో కంపెనీ ప్రతినిధులు, రైతులకు వాగ్వాదం జరిగింది. సుమారు రెండు నెలల కిందట ఇచ్చిన విత్తనాల సంచులు తమ వద్ద ఎలా ఉంటాయంటూ రైతులు మండిపడ్డారు. అనంతరం కంపెనీ ప్రతినిధుల వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. తమకు నష్ట పరిహారం చెల్లించేంత వరకూ వెళ్లనివ్వబోమని భీష్మించారు. ఇలా సుమారు మూడు గంటలకు పైగా రోడ్డుపైనే రైతులు నిర్బంధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. భూములు గోపాలపురం మండలంలో ఉండడంతో అక్కడి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని రైతులకు తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ సూచించారు. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులను తీసుకుని అన్నదేవరపేట రైతులు గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేశారు.
విఘ్నేశ్వరుని హుండీ
ఆదాయం లెక్కింపు
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని దేవదాయ శాఖ అధికారులు ఎం.రాధాకృష్ణ, ఉప్పలపాటి జానికమ్మ పర్యవేక్షణలో గురువారం లెక్కించారు. 60 రోజులకు గాను రూ.29,57,711 లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. అలాగే ఏడు గ్రాముల బంగారం, 743 గ్రాముల వెండి, 17 విదేశీ నోట్లు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment